సొంతంగా కొనుక్కున్న జామకాయ కన్నా దొంగిలించిన జామకాయ తియ్యన అన్నట్లుగా అఫీషియల్‌గా రిలీజ్ అయ్యే దానిని చూసి, వినే కన్నా, లీకైన వాటిని చూడటంలో అభిమానులకు వచ్చే కిక్కే వేరప్పా... ఇక ఇటీవల కాలంలో లీక్‌లు ఎక్కువై పోతున్నాయని సినిమా వారు నానా హంగామా చేస్తున్నారు. కానీ ఈ లీక్‌లు బయటి వారి నుంచి కంటే సొంత ఇంటి వారి నుంచి ఎదురయ్యే లీక్‌లు, పబ్లిసిటీ కోసం చేసే లీకులే ఎక్కువనే సంగతి పరిశ్రమని ఎరిగిన వారికి బాగా తెలుసు. విషయానికి వస్తే అఫీషియల్‌గా బన్నీ నటిస్తున్న 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'లోని 'సైనిక' సాంగ్ ముందురోజు రాత్రే లీకయిపోయింది.
ఇక ఈ పాట దేశభక్తి కాన్సెప్ట్‌తో రిపబ్లిక్ డేకి సరిగ్గా సరిపోయే పాటలా ఉందని మాత్రం చెప్పవచ్చు. బాలీవుడ్ సంగీత దర్శక ధ్వయం విశాల్-శేఖర్‌లు ఈ పాటకి అందించిన ట్యూన్‌లో తెలుగు వాసనే లేదు. కానీ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ దేశభక్తి గీతం మాత్రం ఒళ్లు దేశభక్తితో పులకరించి పోయేలా ఉందని మాత్రం చెప్పవచ్చు. సంగీతం సాహిత్యాన్ని డామినేట్ చేస్తున్న ఈ రోజుల్లో మరలా సంగీతాన్ని సాహిత్యం డామినేట్ చేయడం అనేది పాటలోనే కనిపిస్తోంది. అందుకే రామజోగయ్య శాస్త్రిని ఎంతగా మెచ్చుకున్నా తక్కువే అని చెప్పాలి.
ఇక ఈ చిత్రం ఫస్ట్ ఇంపాక్ట్ మూడ్‌కి తగ్గట్లే ఈ పాట కూడా ఉంది. సరిహద్దుల్లో కాపలా కాస్తున్న దేశజవాన్లకు, వారి గొప్పతానికి సూచకంగా, ఈ పాట వారి కీర్తిని కీర్తిస్తూ సాగటం ద్వారా ఎప్పుడో 'మేజర్ చంద్రకాంత్'లో వచ్చిన పాట తర్వాత అంతటి దేశభక్తి కలిగిన పాటకి ఇది మిగిలిపోతుందని చెప్పవచ్చు. 'సరిహద్దున నీవు లేకుంటే ఏ కనుపాప కంటి నిండా నిదురపోదురా' వంటి ప్రయోగాలు, సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరికీ సులభంగా అర్ధమయ్యే వాడుక భాషలో రాసిన ఈ పాట గొప్ప దేశభక్తి గీతాలలో ఒకటిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పాటను లీక్ చేసినట్లుగానే సినిమా రిలీజ్ నాటికి కూడా కొన్ని సీన్స్‌ని లీక్ చేసి 'అత్తారింటికి దారేది' టైప్‌లో 'భరత్ అనే నేను' కంటే ముందుగా ఈ చిత్రాన్ని విడుదల చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.