బాహుబలి రేంజ్ లో సైరా సినిమాని నిర్మిస్తున్నారు. బాహుబలిలా దేశ నలుమూలలా 'సై రా నరసింహారెడ్డి' సినిమా గురించే మాట్లాడుకునేలా మొదటి నుండి పక్కా ప్లానింగ్ తో ఉన్నారు రామ్ చరణ్ అండ్ టీం. బాహుబలి తర్వాత అంతటి బడ్జెట్... అలాగే అంతటి క్రేజ్ తో తెరకెక్కుతున్న 'సై రా నరసింహారెడ్డి' సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు నుండే ఈ సినిమాపై అనేకానేక రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ రూమర్స్ లో కొన్ని నిజాలు కొన్ని అబద్దాలు లేకపోలేదు. మొదటినుండి భారీ తారాగణంతో.. అలాగే భారీ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు కూడా ఉన్నాయి. కానీ సై రా గురించిన రూమర్స్ మాత్రం అంచనాల కన్నా ఎక్కువగా బయటికి వచ్చేస్తున్నాయి.
ఆ రూమర్స్ లో కొన్నిటిని సై రా టీమ్ ఖండిస్తున్నప్పటికీ.... మరికొన్నిటి విషయంలో మౌనం వహిస్తుండడంతో ఈ రూమర్స్ నిజమనే ప్రచారం కూడా బాగా జరుగుతుంది. మొదట్లో సినిమాటోగ్రాఫర్ తప్పుకోగా... ఆ ప్లేస్ లోకి రత్నవేలు వచ్చేశాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్ సై రా నుండి తప్పుకోగా ఇప్పటికీ సై రా కి మ్యూజిక్ డైరెక్టర్ సెట్ కాలేదు. అలాగే మొన్నటికి మొన్న సై రా డైరెక్టర్ సురేందర్ రెడ్డిని తప్పించినట్లుగా వార్తలొచ్చాయి... కట్ చేస్తే అది ఒట్టి రూమరని తేలిపోయింది. మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ తో బిజీగా వున్న సై రా నుండి ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్ తప్పుకున్నాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అవుతుంది.
సై రాని జాతీయ స్థాయిలో విడుదల చేసే ప్లాన్ లో భాగంగా బాలీవుడ్ నుండి కోలీవుడ్ నుండి శాండిల్ వుడ్ నుండి టాప్ నటీనటులను సై రా కోసం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అమితాబ్ లాంటి సీనియర్ స్టార్ సై రా లో కనబడితే సై రా కి బాలీవుడ్ లోను ఆదరణ ఉంటుందని సై రా బృందం అమితాబ్ ని సై రా నరసింహారెడ్డి గురువు పాత్రకి ఎంపిక చేసింది. ఆ పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ అమితాబ్ సినిమాలో కనిపిస్తాడంటే బాలీవుడ్ జనాలు ఎగబడతారని ఆ పాత్రకి ఆయన్ని ఎంపిక చేశారు. ఇప్పుడు అమితాబ్ సై రా నుండి తప్పుకున్నాడని న్యూస్ మాత్రం సై రా టీమ్ ని బాగా ఇబ్బంది పెట్టిందేమో అందుకే... సై రా టీం అలాంటిదేమీ లేదు బాబోయ్... ఈ చిత్రంలో అమితాబ్ ఖచ్చితంగా నటిస్తారని.. ఆయన షూటింగ్ కి రావడానికి ఇంకా చాలా సమయం ఉందని చెబుతున్నారు.