రామ్ చరణ్ - సమంత జంటగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న 'రంగస్థలం' షూటింగ్ ఒక కొలిక్కి వచ్చేసింది. అనేకానేక కారణాలతో సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుంది. గత ఏడాది మార్చిలో మొదలైన ఈ సినిమా ఈ ఏడాది మార్చి లో విడుదలకు సిద్దమవుతుంది. ప్రస్తుతం విడుదల చేసిన 'రంగస్థలం' ఫస్ట్ లుక్ తో పాటే రంగస్థలం టీజర్ కూడా మెగా అభిమానులనే కాదు సాధారణ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ లో సౌండ్ ఇంజినీర్ గా అదరగొట్టిన రామ్ చరణ్ మొదటిసారి కొత్తగా దివ్యంగుడి పాత్రలో ట్రై చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ పాత్రకే ఇంత ఆదరణ లభిస్తుంటే సమంత పాత్రకు మరింత ఆదరణ రావడం ఖాయమంటున్నారు.
ఎందుకంటే ఇప్పటికే లీకైన సమంత 'రంగస్థలం' స్టిల్స్ ఇంటర్ నెట్ లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ కనబడని విధముగా సమంత పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనబడుతుంది. పేదింటి అమ్మాయిలా, నాలుగు గేదెలను మేపుతూ.. కట్టెల పొయ్యి దగ్గర పొగ గొట్టంతో ఊదుతూ వంట చేస్తున్నట్లుగా ఆ ఫొటోస్ లో సమంత దర్శనమిచ్చింది. అయితే 'రంగస్థలం' టీజర్ లో కేవలం రామ్ చరణ్ ని మాత్రమే చూపించి సమంతని దాచేశారు. అయితే 'రంగస్థలం' టీజర్ లో సమంత లేకపోవడంతో ఆమె అభిమానులు బాగా హార్ట్ అయ్యారు. అందుకే సుకుమార్ కి తమ అభిమానతార సమంత ఉన్న రంగస్థలం టీజర్ ని వదలమని రిక్వెస్ట్ లు పెడుతున్నారట. మరో టీజర్ ద్వారా సమంతని చూపించాలని చిత్ర బృందంపై ఒత్తిడి చేస్తున్నారట సమంత అభిమానులు.
అభిమానుల ఒత్తిడి కాకపోయినా సుకుమార్, సమంత పాత్రతో కూడిన ఒక స్పెషల్ టీజర్ ని కట్ చేసే పనిలో బిజీగా వున్నట్లుగా చెబుతున్నారు. అయితే గతంలో నెట్ లో లీకయిన ఫొటోస్ మాదిరిగానే రంగస్థలంలోని సమంత పాత్ర టీజర్ ఉండబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇకపోతే ఈ టీజర్ మాత్రం అపుడే విడుదల చెయ్యకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యే సమయానికే విడుదల చేస్తారనే టాక్ వినబడుతుంది. అయితే వచ్చే నెల ఫిబ్రవరిలో వాలంటైన్స్ డే సందర్భంగా రామ్ చరణ్ - సమంత పాత్రలతో కూడిన ఈ టీజర్ ని విడుదల చేస్తారనే సమాచారం వుంది.