గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన సీనియర్ స్టార్ శరత్‌కుమార్ తన కెరీర్ ప్రారంభంలో సుమన్, విజయశాంతి నటించిన 'సమాజంలో స్త్రీ', చిరంజీవి 'గ్యాంగ్‌లీడర్' వంటి పలు చిత్రాలలో నటించాడు. ఇక ఈయనకు 'మండే సూర్యుడు' చిత్రం స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుంచి ఆయన స్టార్ హీరోగా తన సత్తా చాటాడు. ఇక ఆయన ఆ మధ్య రాఘవలారెన్స్ నటించి, నిర్మించిన 'కాంచన' చిత్రంలో చేసిన 'హిజ్రా'పాత్రను చేసి మెప్పించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఏ స్టార్ కూడా కనీసం ఊహించలేని పాత్రలో ఆయన ఆ పాత్రను అద్భుతంగా పోషించాడు. తన చిత్రాలన్నింటినీ చూసిన తన భార్య రాధిక ఎప్పుడు తన నటనను పొగడలేదని, కానీ 'కాంచన' చిత్రం తర్వాత ఆమె తన నటనను తొలిసారిగా పొగిడిందని నాడు సంతోషంగా చెప్పాడు.
ఇక ఈయన ప్రస్తుతం పలు తెలుగు చిత్రాలలో కూడా పవర్‌పుల్ సపోర్టింగ్ రోల్స్‌ని చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం ఆయన మరో వైవిధ్యభరితమైన చిత్రానికి ఓకే చెప్పాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ డైరెక్ట్ చేయనుండగా, సోషియో ఫాంటసీగా ఇది రూపొందనుంది. ఈ చిత్రానికి 'పాంబన్' అనే టైటిల్‌ని ఖరారు చేసి తాజాగా పోస్టర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్లలో శరత్‌కుమార్ పాము అవతారంలో కనిపిస్తున్న లుక్‌కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఇంతవరకు నాగదేవతలుగా, నాగినీలుగా హీరోయిన్లే కనిపించారు.
మరి పాము పాత్రలో శరత్‌కుమార్ ఎలా నటించి మెప్పిస్తాడు? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో తనది ఎంతో వైవిధ్యభరితమైన పాత్ర అని, తన నటనకు సవాల్ విసిరే పాత్రను చేయనుండటం తనకెంతో సంతోషంగా ఉందని శరత్‌కుమార్ చెబుతున్నాడు.