ఇటీవల జరిగిన మోహన్‌బాబు 'గాయత్రి' ఆడియో వేడుకలో మంచు ఫ్యామిలీ తమలో తాము పొగడ్తలతో ఈ సభను నింపేశారు. సాధారణంగా సినిమా ఫంక్షన్సు అంటే పొగడ్తలు, ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేయడాలు మామూలే, అయితే మంచు వారి సభ అయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఆ సభలో పాల్గొన్నా అందరు మంచు భజన చేయాల్సిందే. ముఖ్యంగా వారి కుటుంబంలో వారిని వారికి వారే పొగిడేసుకుంటూ ఉంటారు. ఇక ఈ వేడుకలో శ్రియ గురించి మంచుమనోజ్ చేసిన కామెంట్స్, తానేదో జోక్ వేస్తున్నట్లుగా మంచు విష్ణు అనసూయపై చేసిన కామెంట్స్ చూసే వారికి, వినే వారికి చాలా ఇబ్బందిని కలిగించాయి.
ఇక బ్రహ్మానందం అయితే మోహన్‌బాబును చూసి దేవుళ్లు కూడా భయపడతారని చేసిన స్పీచ్ టూ మచ్. మోహన్‌బాబు వారి ఫ్యామిలీ తనకు 'గాయత్రి', 'ఆచారి అమెరికా యాత్ర'ల్లో చాన్స్‌లు ఇచ్చినందుకు బదులుగానా అన్నట్లు దేవుళ్లను కించపరుస్తూ బ్రహ్మానందం చేసిన ఓవర్‌యాక్షన్ మరీ శృతిమించగా, అలా చేయవద్దని మోహన్‌బాబు కూడా ఖండించలేదు. ఇక 'గాయత్రి' చిత్రంలో మోహన్‌బాబు హీరో, విలన్ షేడ్స్ ఉన్న రెండు పాత్రలు చేస్తున్నాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే శివాజీ పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నాడని, ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడంటూ మరోసారి మోహన్‌బాబు తన పుత్రోత్సాహం చూపించాడు. ఈ చిత్రం టైటిల్ 'గాయత్రి' తనకు, మదన్‌కి, రచయిత డైమండ్ రత్నబాబు వంటి ఎవ్వరికీ నచ్చలేదని, కేవలం పరుచూరి గోపాలకృష్ణకి నచ్చి 'గాయత్రి' అనే పేరు వెనుక ఉన్న గొప్పతనాన్ని ఆయన చెప్పడం, మంచు విష్ణు కన్విన్స్ చేయడంతోనే తాను ఆ టైటిల్‌ను ఓకే చేశానని చెప్పాడు.
'గాయత్రి' 100శాతం అద్బుతమైన కథ కాబట్టే ఒప్పుకున్నాను. చాలా ఏళ్ల తర్వాత సంతృప్తినిచ్చిన పాత్ర. శ్రియతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఇందులో ఆమె ఫ్లాష్‌బ్యాక్‌లో శివాజీ భార్యగా నటించింది. ఆ పాత్రను ఒప్పుకోవడం అంటే సవాల్‌ని స్వీకరించడమే. ఆమె క్రమశిక్షణతో తన పని తాను చేసుకుపోయేది. అద్భుతంగా నటించింది. అంతే అభినందించాను. అంతే కాదు ఆ వేడుకలో నేను ఆమెని పొగడలేదు. అభినందన వేరు. పొగడ్త వేరు అని మోహన్‌బాబు చెప్పుకొచ్చాడు. మరి ఆయన తన కుమారులు, కుమార్తెల మీద కురిపించేవి అభినందనలా? పొగడ్తలా..?