నిన్నటితరంలో అద్భుతమైన అభినయం, కళ్లతోనే హవభావాలు ప్రకటించే టాలెంట్, చామనఛాయగా ఉన్నా తన కోల కళ్లతో అందరినీ కట్టిపడేసే అందం భానుప్రియ సొంతం. సితార, స్వర్ణకమలం వంటి చిత్రాలలో ఆమె నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. నాటి లెజెండరీ దర్శకులైన సీనియర్ వంశీ, కె.విశ్వనాధ్‌లకి సైతం ఆమె అభిమాన నటి. ఈమెని పెద్ద వంశీ ఎంతో ప్రేమించాడని కూడా అంటారు. ఇక ఈమె అమెరికాలోని ఫొటోగ్రాఫర్ అయిన ఆదర్శ్ కౌశల్‌ని 1998 జూన్‌లో అమెరికాలోని కాలిఫోర్నియాలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వివాహం చేసుకుంది. కొంత కాలం వారి వివాహబంధం సజావుగానే సాగింది. 2003లో వీరికి ఓ పాప జన్మించింది. ఆమెకి అభినయ అనే పేరును పెట్టారు. తర్వాత 2005లో వారి మద్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆదర్శ్ కౌశల్ ఒంటరిగా అమెరికాలోనే ఉండిపోగా, భానుప్రియ మాత్రం పాప అభినయని తీసుకుని చెన్నైలో స్ధిరపడింది.
అడపాదడపా చిత్రాలు చేస్తూనే భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రాయ విద్యలను ఆసక్తి ఉన్నవారికి నేర్పిస్తోంది. ఈమె సంపాదన, ఆస్థిని అంతా ఆమె తల్లి , సోదరుడు కలిసి మోసం చేశారని, భానుప్రియ, ఆదర్శ్ కౌశల్‌ల గొడవలకు కూడా ఇదే కారణం అంటారు. భానుప్రియ విడాకుల తర్వాత చెన్నై వచ్చి తనకు చెన్నైలో ఉన్న ఎన్నో ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కనీసం చిన్న స్థలం ఇస్తే డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటానని తన సోదరుడి బ్రతిమాలినా కూడా ఇవ్వలేదని అంటారు. ఇక తాజాగా భానుప్రియ మాజీ భర్త ఆదర్శ్‌కౌషల్ అమెరికాలో గుండెపోటుతో మరణించాడు. దాంతో తాను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న ఆదర్శ్ కౌషల్‌ని కడసారి చూసేందుకు భానుప్రియ తన పాపతో కలిసి అమెరికా వెళ్లింది.