ట్విట్టర్‌లో బిగ్‌బికి ఉన్న ఫాలోయింగ్, ఆయన ఫాలోయర్స్ సంఖ్య అందరికీ తెలుసు. కానీ ట్విట్టర్ మాత్రం అమితాబ్‌బచ్చన్ ఫాలోయర్స్ సంఖ్యని తగ్గించి చూపించి, కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్‌కి అమితాబ్ కంటే ఎక్కువ ఫాలోయర్స్ ఉన్నట్లుగా చూపించడంతో అమితాబ్ ట్విట్టర్‌ని వదిలేస్తానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజాగా మన తెలుగు సినీ ప్రముఖులను అమితాబ్ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నాడనే వార్త ఆసక్తిని రేపుతోంది.
అల్లుఅర్జున్, నాగచైతన్య, అఖిల్, నిఖిల్, సందీప్‌కిషన్, కళ్యాణ్‌రామ్, వరుణ్‌తేజ్, అల్లరినరేష్, వెన్నెల కిషోర్, కొరటాల శివ, హరీష్‌శంకర్, అనిల్ రావిపూడి, కాజల్, తమన్నా, రకుల్, అనుపమ పరమేశ్వరన్, లావణ్యత్రిపాఠి, మెహరీన్, ప్రణీత, రెజీనా, రామజోగయ్యశాస్త్రి వంటి వారినందరినీ తాజాగా అమితాబ్ ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారనే వార్త సంచలనంగా మారింది. అమితాబ్ ఎక్కడ? వీరెక్కడ? అందునా ఆయన ఫాలో అవుతున్న వీరిలో చాలా మందికి తెలుగులో తప్ప మరో చోట పాపులారిటీ లేదు. ఇందునా తెలుగు సినీ ప్రముఖులను ఫాలో అవ్వాల్సిన అవసరం అమితాబ్‌కి ఏముంది? అనే చర్చ కూడా మొదలైంది.
ఇందులో ఏదైనా మతలబు ఉందా? ఫేక్ అకౌంట్స్, హ్యాకింగ్ వంటివి ఇందులో ఏమైనా ఇమిడి ఉన్నాయా? అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి వెన్నెల కిషోర్, రకుల్‌ప్రీత్ సింగ్ వంటి వారు అమితాబ్ తమని ఫాలో అవుతున్నారని ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొందరు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి దీనిపై ట్విట్టర్ లేదా అమితాబ్ స్వయంగా స్పందిస్తే గానీ అసలు విషయం తెలియదు అనే చెప్పాలి.