సాటి వారిపై వ్యక్తిగతంగా విమర్శలు చేసినా దానికో హద్దు ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తుల శరీరాకృతులు, వారి లోపాలను ఉద్దేశించి వెకిలిగా మాట్లాడటం ఎంతమాత్రం సమంజసం కాదు. అలాంటి వాటిపై సెటైర్లు వేసేటప్పుడు వారు ఆ లోపాలను సరిదిద్దుకునేలా, సరైన దిశలో నిర్మాణాత్మంగా సలహాలు ఇచ్చేవాటికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. మనం చేసే ప్రతి విమర్శ ఎదుటి వారు గుర్తించగలిగి, సరి చేసుకునే విధంగా ఉండేట్లు చూసుకోవడం జర్నలిస్ట్‌ల బాధ్యత. ఎవరైనా బరువు పెరిగితే. ఇలాగైతే కష్టం అని సూచన ఇవ్వవచ్చు. ఇక ర్యాంగింగ్, టీజింగ్‌ల విషయంలో కూడా మన పెద్దలు ఒకటే చెబుతారు. మనం అమ్మాయిలను కాలేజీ రోజుల్లో టీజ్ చేసినా కూడా వారు కూడా గర్వపడి, కాస్త ఆత్మవిశ్వాసం పెంచుకునేదిగా, వారు కూడా ఎంజాయ్ చేయదగిన విధంగా మాత్రమే కామెంట్స్ ఉండాలి.
కానీ నేడు మీడియా కూడా బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో నానా చెత్తని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ మీడియాలో హీరోయిన్ దిశాపటానీ ఒకప్పుడు ఎంత చండాలంగా ఉందో చూడండి అంటూ ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేశారు. దానికి దిశాపటానీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. మీరు చెప్పింది నిజమే.. ఏడవ తరగతి చదవబోయే విద్యార్ధిని అందంగా డ్రస్ చేసుకోవాలని, అందమైన మేకప్, హెయిర్‌స్టైల్ వేసుకుని మీకు కనిపించలేదు. చదివే వయసులో పిల్లలు చదువు మీద కాకుండా అందాలపై దృష్టి పెట్టాలనేది మీ ఉద్దేశ్యం కాబోలు. మీకు ఇంత కంటే బ్రేకింగ్ న్యూస్ దొరక్కపోవడం బాధాకరం అంటూ రిప్లై ఇచ్చింది.
ఈ మీడియా వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇలా అందాలపై కామెంట్ చేసే వారి మనసులోని ఆలోచనలు ఎలా ఉంటే అందరు అలాగే కనిపిస్తారని కొందరు, మరికొందరు దిశాపటానిని ఉద్దేశించి మీరు ఇప్పుడెలా అందంగా, సంతోషంగా, గర్వంగా ఉన్నారో అలాగే ఉండండి అని ప్రోత్సాహకరంగా దిశా వైపు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి చెత్త విషయాలపై స్పందించి మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దని కూడా కొందరు దిశాకి సూచిస్తుండటం హర్షణీయం...!