టాలీవుడ్‌లో అనిరుధ్ వంటి వారు వస్తుంటారు..పోతుంటారు. కానీ నేటి జనరేషన్‌లో ఇక్కడి చిత్రాలకు దేవిశ్రీప్రసాద్, తమన్‌లే పెద్దదిక్కు. ఇక తమన్ విషయానికి వస్తే ఆయన టాలెంట్‌ని ఎవ్వరూ శంకించరు గానీ కాపీ క్యాట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయినా అతి తక్కువ కాలంలోనే స్టార్స్ అందరితో పనిచేసి 50 చిత్రాలను అతి తక్కువ సమయంలో పూర్తి చేశాడు. ఇక తమన్ పెద్ద ప్లస్ పాయింట్ ఆయన అందించే బీజీఎం. మణిశర్మ తర్వాత ఆ స్థాయిలో ఆయన ఆకట్టుకుంటున్నాడు. తాజాగా 'భాగమతి' చిత్రం ఆయన ఇచ్చిన బీజీఎం కారణంగానే మరో స్థాయికి వెళ్లింది. కాగా ప్రస్తుతం తమన్ తీవ్ర సమస్యల్లో ఉన్నాడు. ఆయన మోహన్‌బాబు నటిస్తున్న 'గాయత్రి, సాయిధరమ్‌తేజ్-వినాయక్‌ల 'ఇంటెలిజెంట్', వరుణ్‌తేజ్ 'తొలి ప్రేమ'లకు సంగీతం అందిస్తున్నాడు.
ఈ మూడు చిత్రాలు రెండు రోజుల వ్యవధిలో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ట్యూన్స్‌పరంగా ఇబ్బంది లేదు. ఆల్‌రెడీ ఇచ్చేశాడు. కానీ ఇప్పుడు బ్యాగ్రౌండ్‌స్కోర్, ఫైనల్ మిక్సింగ్‌లలోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ మూడు చిత్రాలు మూడు డిఫరెంట్ జోనర్స్ కావడం, బీజీఎంకి ఎంతో ప్రాముఖ్యం ఉండటం మరో కారణం. ఈమధ్య మనవారు సినిమాలను చివరి క్షణంలో సెన్సార్‌కి పంపి హడావుడి పడకుండా, కాస్త ముందుగానే వాటిని పూర్తి చేస్తున్నారు. దీంతో ముగ్గురు ముందు తమ చిత్రం అంటే కాదు తమ చిత్రం అని పోటీ పడుతున్నారట. సాయిధరమ్‌తేజ్, వినాయక్‌లకి తమన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.
మరోవైపు 'తొలిప్రేమ' వంటి క్యూట్ లవ్ స్టోరీకి ఫ్రెష్ నెస్ తీసుకుని రావడంలో తమన్‌దే బాధ్యత. 'తొలిప్రేమ' తాను చేయబోయే చాలెంజింగ్ ప్రాజెక్ట్ కావడం, ఏదైనా తేడా వస్తే మెగా కాంపౌండ్‌తో ఇబ్బందులు వస్తాయి. ఇక మోహన్‌బాబు గురించి అందరికీ తెలిసిందే. ముందు ఆయన పని కాకపోతే దేనికైనా తెగిస్తాడు. మొత్తానికి తమన్ తబలాకి తలపోట్లు ఖాయంగా తెలుస్తోంది. మరి ఈ స్థితిని ఆయన ఎలా అధిగమిస్తాడో వేచిచూడాల్సివుంది.