బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకొణె , రణ్వీర్ సింగ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. వీరి వివాహంపై గతంలోనే చాలా సందర్భాల్లో వార్తలు వచ్చినప్పటికీ ప్రేమ, పెళ్లిపై ఈ జంట ఇంతవరకు స్పందించిన సందర్భం లేదు. అయితే గాఢమైన ప్రేమలో ఉన్న దీపిక – రణ్వీర్ లు ఈ సంవత్సరం పెళ్లితో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు సమాచారం.. ఇద్దరికీ బీచ్ లు అంటే ఇష్టం కనుక బీచ్ సైడ్ వెడ్డింగ్ కే వారు ఎక్కువ మక్కువ చూపే అవకాశముందట..
ఇప్పటికే దీపిక – రణ్వీర్ ల కుటుంబాలు ఈ పెళ్ళికి సమ్మతం తెలిపాయని.. పలు సంచలనాలకు కేంద్ర బిందువు అయిన పద్మావత్ చిత్రం విడుదల కాగానే వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట. అందుకే ఇప్పుడు ఈ సంవత్సరంలోనే వీరి పెళ్లి ఉండనుందని తెలిసింది. పెళ్లి మాత్రం కొద్దిమంది అతిధుల సమక్షంలో జరగనుందని.. పెళ్లి తరువాత వారు ఇండియాలో రెండు విందులు ఏర్పాటు చేయనున్నారట.. ఒక విందు ముంబాయిలో బాలీవుడ్ ప్రముఖులకు, రణ్వీర్ కుటుంబ సభ్యులకు కాగా.. మరొక విందు బెంగుళూరులో దీపికా పదుకొణె బంధువులకు ఏర్పాటు చేయనున్నారని తెలిసింది.
మరి ఈ జంట పెళ్లి గురుంచి ఏ విషయమో చెపుతారా..? లేదా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క, క్రికెటర్ విరాట్ అంటే.. విరుష్క లా చడీచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుంటారా..? అనేది తెలియాలంటే కొద్దిగా వేచి చూడాల్సిందే.