టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో మహేష్‌బాబు-నమ్రతాశిరోద్కర్‌లని ముందుగా చెప్పుకోవాలి. సినిమాలు, యాడ్స్, కుటుంబ విలువలతో వీరు ఆదర్శవంతంగా ఎలాంటి వాద వివాదాలకు చోటు లేని విధంగా తమ వ్యక్తిగత జీవితాన్ని పదిమంది మెచ్చుకునే విధంగా గడపటంలో ముందుంటారు. ఎప్పుడు వివాదాలకు చోటివ్వని జంట అంటూ టాలీవుడ్‌లో ఉందంటే దానిని ఈ జంటేనని ఒప్పుకోవాలి. 2005లో వివాహం జరిగిన రోజు నుంచి మహేష్‌బాబు అటు వృత్తిపరమైన జీవితం పరంగా, కెరీర్ పరంగా తనదంటూ ప్రత్యేకశైలిలో ఉంటారు. ఎవరి మీదనైనా పుకార్లు వచ్చి ఉంటాయి గానీ వీరి మీద మాత్రం ఎలాంటి చిన్న విషయంలో కూడా బేధాభిప్రాయలు అంటూ వార్తలు వచ్చి ఎరుగవు.
ఇక మహేష్ కూడా సినిమాలు, యాడ్స్ వంటి వృత్తిపరమైన బిజీ, ఖాళీ దొరికితే సేవాకార్యక్రమాలలో బిజీగా కాలం గడిపేస్తూ ఉంటారు. సామాజికంగా కూడా ఎంతో బాధ్యత కలిగిన జంటగా, పేదలకు, పిల్లలకు సేవ చేస్తూ, శ్రీమంతుడు స్ఫూర్తితో తెలంగాణ, ఏపీలలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల అభివృద్దికి కృషి చేస్తుంటారు. రెయిన్‌బో హాస్పిటల్, ఆంధ్రా హాస్పిటల్స్‌కి ఉచిత బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేయడంలో మహేష్ దంపతులు ఎంతో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇటీవలే ఓ చిన్నారి క్యాన్సర్‌తో పోరాడుతుంటే అతనికి శస్త్రచికిత్స కోసం ఆర్ధికసాయం అందించడమే కాదు... 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండి కూడా ఆ బాబు తన తల్లిదండ్రులతో కలిసి తనని కలవడానికి వస్తే వారిని కలిసి పరామర్శించారు.
ఇక తాజాగా మహేష్ -నమ్రతలు తమ పెళ్లిరోజు సందర్భంగా హైదరాబాద్‌లోని దేవ్నార్ 600మంది దివ్యాంగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్, నమ్రతల పెళ్లినాటి ఫొటోలను కూడా వారి అభిమానులు భారీ ఎత్తున పోస్ట్ చేస్తున్నారు. 2005లో ఇదే రోజున వివాహంతో ఒకటైన మహేష్ జంట మరెన్నో పెళ్లిరోజులు జరుపుకోవాలని కోరుకుందాం.