ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న '2.0'తో పాటు 'కాలా' చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ముందుగా ఏ చిత్రం విడుదల అవుతుంది అనే విషయం ఆసక్తిని కలిగిస్తోంది. రజనీ ఈమద్య '2.0' చిత్రం తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 13న విడుదల అవుతుందని ప్రకటించాడు. కానీ ఈ చిత్రం గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ పనులు ఆలస్యం కానుండటంతో ఈ చిత్రం సమయానికి విడుదల కాకపోవచ్చని వార్తలు వస్తున్నాయి. మరోవైపు రజనీ కాంత్ 'కబాలి' తర్వాత దర్శకుడు రంజిత్ పా దర్శకత్వంలో 'కాలా' చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. తాజాగా దీనికి సంబంధించిన డబ్బింగ్‌ను కూడా రజనీ పూర్తి చేశాడు. మొత్తానికి ఏప్రిల్‌లో '2.0' లేదా 'కాలా' .. ఈ రెండింటిలో ఏదో ఒకటి విడుదల ఖాయమని కోలీవుడ్ మీడియా అంటోంది. కానీ రజనీ మాత్రం '2.0' తర్వాత 'కాలా' అని స్పష్టం చేశాడు.
కానీ ఎట్టకేలకు కోలీవుడ్ మీడియా మాటే నిజమైంది. రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న 'కాలా' చిత్రం పోస్టర్‌ని తాజాగా యూనిట్ విడుదల చేస్తూ, డాన్‌కే డాన్ వస్తున్నాడని తెలిపింది. ఈ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానున్నట్లు పోస్టర్ ద్వారా దృవీకరించారు. రజనీకాంత్ అల్లుడు స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం మొదటి భాగం ముంబై బ్యాక్ డ్రాప్‌లో, రెండో భాగం తమిళనాడు బ్యాక్ డ్రాప్‌లో నడుస్తాయి. ఇక రజనీకి భార్యగా ఈశ్వరీరావు నటిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖులైన హ్యుమా ఖురేషి, నానా పాటేకర్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. దీంతో '2.0' విడుదల ఇప్పుడప్పుడు కాదని తేలిపోయింది.
మరోవైపు ఏప్రిల్27న టాలీవుడ్‌లో మహేష్‌బాబు 'భరత్ అనే నేను', అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'లు రావాలనుకుంటున్నాయి. అయితే 'కాలా'విషయంలో క్లారిటీ రావడంతో ఇప్పుడు తమ చిత్రాలను ఎప్పుడు విడుదల చేయాలో నిర్ణయించుకునే సమయం వచ్చిందనే చెప్పాలి. మరి రజనీకి పోటీ వెళ్లతారా? లేదా సైడిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.