నేచురల్‌స్టార్ నాని తర్వాత విభిన్న చిత్రాలను, దర్శకులను, నిర్మాతలను ఎంచుకుంటూ తనదైన వినూత్న కథలు, పాత్రలతో దూసుకెళ్తున్న యువ హీరో శర్వానంద్. శర్వానంద్ సినిమా వస్తోందంటే సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని అందరు ఒక అభిప్రాయానికి వస్తున్నారంటే.. సైలైంట్ కిల్లర్‌గా ఆయన చిత్రాలను అభివర్ణిస్తున్నారంటే ఆయనకున్న క్రేజ్ ఏమిటో అర్ధమవుతుంది. 'శతమానంభవతి, మహానుబాహుడు' తర్వాత ఈయన జోరు పెంచడమే కాదు... పెద్ద హీరోలకు కూడా భయపడకుండా తన చిత్రాల కంటెంట్ మీద ఉండే నమ్మకంతో వాటిని పోటీగా దింపుతూ విజయాలను అందుకుంటున్నాడు. నాని సినిమాలలో అయినా మూసధోరణి కనిపిస్తుందే గానీ శర్వానంద్ మాత్రం తన మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ఓకే చేశాడు.
ఇందులో శర్వానంద్ ద్విపాత్రాభినయమో లేక రెండు విభిన్న గెటప్‌లలోనో కనిపించనున్నాడు. ఇందులో ఒకటి 40ఏళ్ల పాత్రధారిగా ఉంటుందని సమాచారం. మాఫియా బ్యాక్ డ్రాప్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో ఆయన సరసన కాజల్, నిత్యామీనన్‌లని ఎంపిక చేశారు. ఇక నేటి రోజుల్లో ఏదైనా హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లలో వచ్చే మధ్యతరహా వయసు పాత్రలకు హీరోయిన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిత్యామీనన్‌ని భావిస్తున్నారు.
ఇక యంగ్ పాత్రకి కాజల్‌ని తీసుకున్నారు. ఇక గతంలో శర్వాతో కలసి నిత్యామీనన్ నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రానిరోజు' మంచి విజయం సాధించింది. కానీ ఈ చిత్రం నుంచి కాజల్, నిత్యా ఇద్దరు వైదొలగారు. మరి రెమ్యూనరేషన్ కారణంగా వీరు వెనక్కి వెళ్లారా? లేక డేట్స్ ప్రాబ్లమా? అనే చర్చసాగుతోంది. డేట్స్ వీలుకాకపోవడానికి వీరేమి ఎక్కువ చిత్రాలలో నటించడం లేదు. ఇక ఇందులో ఒక పాత్రకు 'హలో' ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్‌ని పెట్టుకోగా, రెండో పాత్రకి కాజల్ స్థానంలో ఎవరిని తీసుకుంటారో వేచిచూడాల్సివుంది.