తెలుగులో కామెడీ చిత్రాలకు, ఏకంగా కామెడీ హీరోలకు కూడా స్టార్‌డమ్‌ని తెచ్చిన వారిలో నటకిరీటి రాజేంద్రప్రసాద్‌కి అగ్రస్థానం దక్కుతుంది. ఈయన గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమాలో హాస్యాన్ని పలు కొత్త పుంతలు తొక్కిస్తూ వస్తున్నారు. నాటి జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ నుంచి నేటి చంద్రసిద్దార్ద్, క్రాంతి మాధవ్ వరకు ఆయన నట ప్రస్దానం సాగుతోంది. ఇక ఈయన పలు చిత్రాలలో ఈమధ్య సపోర్టింగ్స్ రోల్స్ కూడా చేసి తన సత్తాను చాటుతున్నాడు. సీనియర్ హీరోలు యూత్ హీరోలతో కలిసి నటించడం అనేది బాలీవుడ్‌లో ఎప్పటినుంచో ఉంది.
అలా రాజేంద్రప్రసాద్ 'జులాయి. సన్నాఫ్ సత్యమూర్తి, ఆడో రకం ఈడో రకం' వంటి చిత్రాలతో ఆ ట్రెండ్‌ని తెలుగులోకి తీసుకుని వచ్చారు. ఇక నాటి మేధావి, బహుభాషా కోవిదుడు, దేశాన్ని ప్రధానిగా పరిపాలించిన పీవీ నరసింహారావు సైతం తన మనసు బాగోలేకపోయినప్పుడు రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రాలను చూస్తూ ఉంటానని చెప్పడం నిజంగా రాజేంద్రునికి గర్వకారణంగా చెప్పాలి. ఇక మా అసోసియేషన్‌కి కూడా ప్రెసిడెంట్‌గా చేసిన రాజేంద్రప్రసాద్ రాజకీయాలలోకి వస్తారేమో అని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వాటికి ఆయన ఫుల్ స్టాప్ పెట్టారు. రాజకీయాలు నా వంటికి పడవు. నా జీవితాంతం అందరినీ నవ్వించడమే నాకిష్టమని తెలిపాడు.
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో క్షీరపురి అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్ సంస్థ ఆయనను 'జీవిత సాఫల్య పురస్కారం'తో గౌరవించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'టామీ' చిత్రంలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన నంది అవార్డును గెలుచుకున్నందుకు గాను ఈ సత్కారం జరిగింది. ఇక ఈ కమిటీలో సినీ ప్రముఖులైన జనార్ధన్ మహర్షి, ఎం.వి.రఘులు కూడా ఉండటం గమనార్హం.