త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఎప్పుడు ఎదుర్కోని ఘోర విమర్శలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నాడు. ఆయన పవన్‌కళ్యాణ్‌తో తీసిన 'అజ్ఞాతవాసి' చిత్రం 'లార్గో వించ్'కి కాపీ కావడం, ఆ విషయంలో తనను ఎవ్వరూ కనిపెట్టలేరని త్రివిక్రమ్ భావించడం, మరోవైపు ఈ చిత్రం ఘోరపరాజయం పాలై తెలుగు ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్స్‌లో ఒకటిగా నిలవడంతో ప్రస్తుతం విమర్శకులు అంతకు ముందు త్రివిక్రమ్ తీసిన సినిమాల బూజును కూడా దులిపి ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. 'అ..ఆ' చిత్రం కూడా యద్దనపూడి సులోచనా రాణి 'మీనా' నవలకు ఆధారం అని, అయినా టైటిల్ క్రెడిట్స్‌లో ఆమె పేరును ప్రస్తావించని విషయంలో కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక 'లార్గో వించ్' విషయంలో తాను హారిక అండ్ హాసిని సంస్థను వదిలేది లేదని, దర్శకుడు జెరోం సల్లె ప్రకటించాడు. హైదరాబాద్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేం చేసేది ఆయన స్పష్టంగా చెప్పాడు. నోటీసులు ఇచ్చి రెండు వారాలు దాటుతున్నా ఇప్పటి వరకు చిత్ర నిర్మాణ సంస్థ నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని, సినిమా ప్రపంచవ్యాపంగా విడుదలైందని, ఇకపై కాపీ కొట్టేవారు అమెరికా, ఫ్రాన్స్ వంటి విదేశాలలో విడుదల చేసుకోవాలంటే భయపడే విధంగా తన చర్యలు ఉంటాయని ఆయన హారిక అండ్ హాసిని బేనర్‌ని ఉద్దేశించి హెచ్చరికలు పంపాడు.
ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్ హీరోగా రూపొందుతున్న 'ఛల్ మోహన్ రంగా'కి కూడా ఎలాంటి కథ ఇచ్చాడా? అనే చర్చ ప్రారంభం కాగా, త్వరలో ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ హారిక అండ్ హాసిని బేనర్‌లోనే రూపొందే చిత్రం కథ విషయంలో ఇది మధుబాబు నవల ఆధారంగా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా వీటికి మధుబాబు క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్ చిత్రానికి తాను కథను ఇవ్వడం లేదని, అసలు త్రివిక్రమ్ ఈ చిత్రం కథ విషయంలో తనను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో తాను కథలు రాయడానికి సిద్దంగా ఉన్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేయడంతో ఎన్టీఆర్ చిత్రం త్రివిక్రమ్ సొంత స్టోరీ ఆధారంగా రూపొందుతున్నట్లు స్పష్టమవుతోంది.