వచ్చే కాలంలో పవన్ శ్రీకృష్ణుడి అవతారం ఎత్తి, ఉండవల్లి అర్జునుడుగా మారి మహాభారత యుద్దమైన ఎన్నికల కురుక్షేత్రంలోకి వెళ్లతారా? లేక ఉండవల్లి శ్రీకృష్ణుడుగా ఉంటే పవన్ అర్జునుడు అవుతాడా? అనే చర్చ బహు రసవత్తరంగా సాగుతోంది. నిజానికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయనకు కుడి భుజంగా వ్యవహరించిన వారు ముగ్గురు, ఒకరు ఉండవల్లి అయితే రెండోది రోశయ్య, మూడోది కెవిపి రామచంద్రరావు. నాడు రామోజీరావు ఆట కట్టించడంలో, సాక్షి పత్రికను స్థాపించడంలో ఉండవల్లిది కీలక పాత్ర. నిస్సందేహంగా నేడున్న ఏపీలోని మేధావులలో అగ్రపీఠం ఉండవల్లికే దక్కుతుంది. ఇక పవన్ ఇప్పటికే ఉండవల్లి, జయప్రకాష్ నారాయణలను కలిపాడు రాబోయే కాలంలో ఆయన సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, ఎంవి మైసూరా రెడ్డి, చల్లసాని వంటి మేధావులను కూడా ఒకటిగా చేయగలిగితే మాత్రం ఉండవల్లి చెప్పినట్లు పవన్ నిజమైన రాజకీయాలు చేయడం ఇప్పుడే మొదలైంది అనే మాట కరెక్ట్ అవుతుంది.
మరోవైపు వైసీపీ నేతలు ఇంతకాలం టిడిపి కేంద్రంలోని బిజెపి ఏపీని మోసం చేస్తోందని చెప్పలేదని ఎదురుదాడికి దిగుతున్నాయి. పోనీ ఇప్పుడు బిజెపి బండారం బయటి పడింది కదా... మరి ఇప్పుడైనా బిజెపి విషయంలో వైసీపీ అయినా గట్టిగా నిలదీయగలదా? అనేది సందేహమే. కేంద్రం చేతిలో జగన్ తప్పొప్పులు, అక్రమాస్తుల చిట్టా ఉంది కాబట్టి వైసీపీ నాయుకులు కేవలం టిడిపినే టార్గెట్ చేస్తున్నారు గానీ మోదీని పల్లెత్తు మాట అనేందుకు కూడా భయపడుతున్నారు. ఇక కేంద్రం ఏపీకి ఇచ్చామని చెబుతున్న నిధులు, టిడిపి ఇవ్వలేదని చెబుతున్న కబుర్లు చూసి ఇద్దరిలో ఎవరో ఒకరు అబద్దం ఆడుతోన్న మాట నిజమేనని పవన్ అంటున్నాడు. ఇక్కడ కేంద్రం ఇచ్చిన కొన్ని నిధులను చంద్రబాబు ఆయా అభివృద్ది పనులకు కాకుండా దారి మళ్లించి, రైతులు రుణమాఫీ వంటి తన సొంత కార్యాలకు ఖర్చుచేసుకున్నట్లు కొందరు అనుమానిస్తున్నారు.
అదే సమయంలో అన్ని రాష్ట్రాలకు ఎలాగైతే నిధులను కేటాయించిందో బిజెపి ఏపీకి కూడా అంతే ఇచ్చిందని, ఎక్కువ ఇచ్చిన దాఖలాలు లేవని కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి తాజాగా పవన్‌కి మాత్రం ఉండవల్లి తన రాజకీయ అనుభవంతో ఒక మాట చెప్పాడు. అధికార పార్టీలు అబద్దం చెప్పవు. అలాగని నిజాలు చెప్పవని చెప్పి పవన్‌కి రణనీతి, రాజకీయనీతి ఎలా ఉంటాయో ఒకే వాక్యంతో పవన్‌కి తెలియజెప్పాడనే చెప్పాలి.