మన పెద్దలు ఏ వయసులో జరగాల్సినవి ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలని చెబుతారు. కానీ దీనికి మన సినీ నటులు మాత్రం చాలా దూరం అనే చెప్పాలి. షష్టిపూర్తికి దగ్గరవుతున్న సల్లూభాయ్ నుంచి ప్రభాస్, రానా, నితిన్, శర్వానంద్, సాయిధరమ్‌తేజ్, నిఖిల్, నారా రోహిత్, అల్లు శిరీష్, వరుణ్‌తేజ్ వరకు ఈ విషయంలో నిదానమే ప్రధానం అంటున్నారు. ఇక అల్లరి నరేష్, నాని వంటి వారే వయసులో ఉన్నప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటే మిగిలిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్స్ మాత్రం ఇప్పుడేనా? అని ప్రశ్నిస్తూ ఏళ్లకు ఏళ్లు 'ఓ స్త్రీ రేపురా' అన్న తరహాలో ఎప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చిన వచ్చే ఏడాది చూద్దాం.. ఈ సినిమా పూర్తయిన తర్వాత, అదిగో 'బాహుబలి' తర్వాత ఇదిగో 'సాహో' తర్వాత అని మాటలు చెబుతున్నారు. కానీ మరో యంగ్ హీరో నాగశౌర్య మాత్రం అందరు దీవించాలే గానీ వచ్చే వాలెంటైన్స్‌డే కల్లా ఓ అమ్మాయితో కలిసి ఉంటానని మాట ఇస్తున్నాడు.
ఇక ఈయన హీరోగానే కాకుండా తాజాగా నిర్మాతగా కూడా 'ఛలో' చిత్రం నిర్మించి, మాస్ మహారాజా రవితేజ 'టచ్ చేసి చూడు' తో పోటీ పడి పెద్ద హిట్‌నే కొట్టాడు. మొదటి వారంలోనే అసలు పోను రెండు కోట్ల లాభాల వరకు అందుకున్నాడు. ఫుల్‌రన్‌లో, డిజిటల్, శాటిలైట్, రీమేక్ రైట్స్ వంటి వాటి ద్వారా మరింత లాభాలు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలా చూసుకుంటే ఈ ఏడాది నాగశౌర్యకి మంచి గుర్తుండిపోయే ఏడాదే అవుతుంది. ప్రస్తుతం పలు చిత్రాలను ఒప్పుకున్న ఈయన వాలెంటైన్ డే సందర్భంగా 'ప్రేమను తెలుపుకునే వారు తమ ప్రేమను పాజిటివ్‌గా, సాఫ్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయండి. ఇష్టం లేని వారిని ఇబ్బంది పెట్టవద్దు. ఒప్పుకోకపోతే బలవంత పెట్టవద్దు. ప్రేమికుల ప్రేమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్‌రెడీ ప్రేమ సక్సెస్ అయితే పెళ్లికి ఆల్ ది బెస్ట్. పెళ్లి కూడా అయిపోతే పుట్టబోయే పిల్లలకు ఆల్‌ది బెస్ట్. పిల్లలు కూడా పుట్టి ఉంటే వారి స్కూల్ ఫీజులకు ఆల్‌ది బెస్ట్' అంటూ విభిన్నంగా స్పందించి అందరి ఆశీర్వాదాలు ఉంటే వచ్చే ఏడాదికి తాను జంటగా కనిపిస్తానని శుభవార్త చెప్పాడు.