తెలుగు నాట పవన్‌కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చేశాడు. ఇక ఈ తర్వాత ఆయన సినిమాలు చేస్తాడా? లేదా? అనే విషయంలో మాత్రం సందిగ్డం నడుస్తోంది. కొంతకాలం గ్యాప్ తర్వాత ఆయన మరలా సినిమాలు చేస్తాడని, తన నిర్మాణంలో ఆల్‌రెడీ నితిన్‌తో 'ఛల్ మోహన్ రంగా' టైపులో చిత్రాలు నిర్మిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక తమిళనాట రాజకీయాలలోకి ప్రవేశించిన రజనీ 'కాలా, 2.0' చిత్రాలను పూర్తి చేయడంతో ఆయన రెండు చిత్రాలు ఇదే ఏడాది విడుదల కానున్నాయి. ఆ తర్వాత ఆయన పొలిటికల్ నేపధ్యంలో ఓ చిత్రంలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విషయానికి వస్తే భారతీయ సినిమా గర్వంగా చెప్పుకునే నటుల్లో కమల్‌హాసన్ మొదటి స్థానంలో ఉంటాడు. బహుశా తన కెరీర్‌లో ఆయన చేసిన ప్రయోగాలు, ఆయన చేసినటువంటి వినూత్న పాత్రల విషయంలో ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రాలేరు. కేవలం అమీర్‌ఖాన్, విక్రమ్ వంటి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ప్రజల చేత లోకనాయకుడిగా పిలువబడే కమల్‌హాసన్ ఈ నెల 21న తన పార్టీ జెండా, అజెండా, ఇతర విషయాలను ప్రకటించి స్వర్గీయ రాష్ట్రపతి అబ్డుల్‌కలాం ఇంటి నుంచి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించనున్నాడు.
ఇక తన నుంచి వచ్చేవి రెండు చిత్రాలేనని తర్వాత నటించే ప్రసక్తే లేదని చెప్పేశాడు. బహుశా ఆ రెండు 'విశ్వరూపం 2, భారతీయుడు 2' అయ్యే అవకాశాలున్నాయి. తాను నటునిగా ఎంతో సంపూర్ణ, సంతోషమైన జీవితం గడిపానని, ఇక రజనీతో పనిచేస్తానా? లేదా? అనేది భవిష్యత్తు తేల్చుతుందని అన్నాడు. రజనీ రంగు కాషాయం అయితే మాత్రం తాను ఆయనతో కలవనని, ఇక తన పార్టీ రంగు నలుపు అంటే ద్రవిడుల శరీరం రంగు అని తెలిపాడు. ఇది తమిళుల రంగు. నా సినీ కెరీర్‌లో క్రమశిక్షణ కలిగిన 10లక్షల మంది అభిమానులను ఏర్పాటు చేసుకున్నాను. ఇప్పుడు వారే మరింత యువరక్తాన్ని నా వద్దకు తీసుకుని వస్తున్నారు.
అందులో 250 మంది గొప్ప న్యాయవాదులు కూడా ఉన్నారు. నా 37ఏళ్ల కెరీర్‌లో నేను సాధించుకుంది ఇదే. నేను ప్రజలతో నడించేందుకు రాజకీయాలలోకి వస్తున్నానే గానీ రాజకీయ నాయకులతో నడిచేందుకు కాదు. ఇక నా పార్టీకి మెజార్జీ రాకపోయినా ప్రతిపక్షంలో కుర్చుంటానే గానీ ఎవరితో పొత్తు పెట్టుకోను. నాకు హిందువులంటే ద్వేషం లేదు. కానీ నాకు నియంతృత్వ పోకడలు, అతివాదం అంటే మాత్రం చాలా కోపమని చెప్పుకొచ్చాడు.