ఆ మధ్య జలీల్‌ఖాన్ ఓ చోట 'బీకాంలో ఫిజిక్స్' చదివానని చెప్పడంతో ఆయనపై తీవ్ర విమర్శలతో పాటు నవ్వుతెప్పించేలా ఉన్న ఆ వ్యాఖ్యలు అంత వరకు జలీల్‌ఖాన్ ఎవరో తెలియని వారికి కూడా ఆయనను తెలిసేలా చేశాయి. మరీ చదువుపై ఇంత అవగాహన లేకుండా మాట్లాడితే ఎలా అనే ప్రశ్నలు ఉదయించి, వీరా మన ప్రజా ప్రతినిధులు అనే దాకా వచ్చాయి. ఆ తర్వాత మరో టిడిపి నాయకులు ఇంటర్‌లో బిఎస్సీ చేశానని చెప్పాడు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే నాకు పన్ను కట్టేవారు. నా నుంచి వృధ్దాప్యపించన్లు తీసుకునే వారు నాకు ఓటు వేయకపోతే నేను వేసిన రోడ్లలో నడవద్దని చెప్పాడు. ఇక పవన్‌కళ్యాణ్ ఓ సందర్భంగా శాస్త్రవేత్తల పేర్లలో తికమకపడి ఓ వస్తువును కనుగొనిన శాస్త్రవేత్త పేరును మార్చివేశాడు. ఇక తాను రాష్ట్రంలో నీటి ఎద్దడిని లేకుండా చేస్తానని చెప్పబోయి నీరే లేకుండా చేస్తానని లోకేష్‌బాబు వ్యాఖ్యానించాడు. ఓటర్‌కార్డు, ఆధార్ కార్డ్ లేని వారు కూడా విమర్శలు చేస్తారా? అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు వంతు జగన్ వద్దకు వచ్చింది.
ఈయనకు కూడా రాజకీయాలలో ఉన్న అనుభవం పిసరంత అని అందరికీ తెలుసు. ఈయన తన ఎంపీలు ప్రత్యేకహోదా కోసం ఎప్పుడో రాజీనామా చేస్తామని ప్రకటించాడు. ఆ తర్వాత ఆ ముచ్చటే లేదు. ఇప్పుడు కూడా ఏప్రిల్‌లో రాజీనామాలు చేస్తామని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టాడు. ఇక విషయానికి వస్తే జలీల్‌ఖాన్‌ని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తే జగన్‌ని పాద యాత్ర సందర్భంగా ఇంటర్వ్యూ చేశాడు. సాధారణంగా జగన్ ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వడు. ఎందుకంటే ఆయన పరిజ్ఞానం ఆయనకు తెలుసు. తెలిసి తెలియక మాట్లాడి, తద్వారా నవ్వుల పాలు అవుతాననే విషయం తెలిసే ఆయన నేను ఇంటర్వ్యూలు ఇవ్వను అని చెబుతాడు. కానీ పాదయాత్ర సందర్బంగా ఆ విలేకరి ఇంటర్వ్యూలో మాట్లాడిన జగన్ 'ప్రత్యేకహోదా' వస్తే ఆదాయపు పన్ను కట్టాల్సిన పనిలేదు. ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించాడు.
కానీ ప్రత్యేకహోదా వల్ల పరిశ్రమలకు రాయితీలు ప్రభుత్వాలకు మరికొన్ని ఆర్దికలాభాలు జరుగుతాయే గానీ ప్రత్యేకహోదా ఇస్తే ఆదాయపు పన్ను కట్టనవసరం ఉండదా? ఈ విషయం మొదటగా జగన్‌కే తెలిసినందుకు హ్యాట్సాఫ్. విషయ పరిజ్ఞానం లేకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయి. ఇలాంటి ఏమీ తెలియని వ్యక్తికి సీఎం అయ్యే అర్హత ఉందా? అని అందరు ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి తప్పులు దొర్లితే సాధారణంగా ఎడిటింగ్‌లో తీసేస్తారు. కానీ ఎడిటింగ్‌లో నుంచి కూడా ఈ వ్యాఖ్యలు బయటపడటం చూస్తే జగన్ అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆయనకు ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీపై ఎలాంటి అవగాహనలేదనే చెప్పవచ్చు. మరి 'గాయత్రి' చిత్రంలో చంద్రబాబు, లోకేష్‌లని విమర్శించిన మోహన్‌బాబు జగన్ విషయంలో ఏమి స్పందిస్తాడో చూడాలి...!