సినిమా ఆడినా ఆడకపోయినా అందులో మహేష్‌బాబుకి సెటైర్లు వేసే అవకాశం ఇస్తే మాత్రం తనదైన టైమింగ్, డెలివరీతో అద్బుతంగా పేలాలా చేస్తాడు. ఈ విషయం 'దూకుడు, ఆగడు' వంటి చిత్రాలలో నిరూపితం అయింది. ఇక మహేష్ నిజజీవితంలో కూడా ఎంతో స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవుతాడట. వారు వీరని కాదు.. సమయం, సందర్భం వస్తే ఎవరిపైనైనా సరే పంచ్‌లు, సెటైర్లు వేయడంతో ముందుంటాడని అంటారు. ఆయనతో షూటింగ్ అంటే ఎంతో జాలీగా ఉంటుందని, ఆయన సెటైర్లు కూడా అందరినీ నవ్వించేలా ఉంటాయని ఆయనతో పని చేసిన వారు అంటారు.
ఇక ఈ విషయాన్ని ఆయన అక్కయ్యే స్వయంగా ఉదాహరణలతో కూడా చెప్పింది. నటిగా, నిర్మాతగా పరిచయం ఉన్న ఘట్టమనేని మంజుల ప్రస్తుతం 'మనసుకు నచ్చింది' చిత్రంతో దర్శకురాలిగా మారింది. ఫిబ్రవరి 16 విడుదల కానున్న ఈ చిత్రంలో సందీప్‌కిషన్, అమైరా దస్తూర్, త్రిధా చౌదరి వంటి వారు నటించారు. ఆమె కూతురు. మహేష్ మేనకోడలు కూడా ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో వేడుకకు రాలేకపోయిన మహేష్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి మాత్రం హాజరుకావడమే కాదు.. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాడు.
ఈ వాయిస్ ఓవర్ సందర్భంగా మంజులా మహేష్‌తో మరో విధంగా ట్రై చేయరాదా? అని అడిగిన వెంటనే మహేష్ నువ్వు ఈ వాయిస్‌ఓవర్‌కి మరొకరిని చూసుకోరాదా? అని సెటైర్ వేశాడట. ఇక మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ తన తండ్రితో నాన్నా ఆంటీ డైరెక్టర్ అయిపోయింది కదా. నువ్వు ఆమె చిత్రంలో నటించవచ్చు కదా అని అడిగితే, మీ ఆంటీతో నేను సినిమా చేస్తే అదే నా ఆఖరి చిత్రం అవుతుందని మహేష్ సెటైర్ వేశాడట. మరి ఇప్పుడు కాకపోయినా మరి కొంత కాలం తర్వాత అయినా మంజుల దర్శకత్వంలో మహేష్ తప్పకుండా నటిస్తాడని పలువురు అంటున్నారు.