సోషల్ మీడియా లేనంత కాలం ఫ్లాప్ చిత్రాన్ని కూడా ఇన్ని కోట్లు వసూలు చేసింది.... ఇన్ని థియేటర్లలో విడుదలై రికార్డు సృష్టిస్తోంది.. ఇన్ని కోట్లు వసూలు చేస్తోంది అని నిర్మాతలు చెప్పే వాటిని గుడ్డిగా సినీ పత్రికల వారు రాసేవారు. ముఖ్యంగా సినీ పత్రికలు, ఇతర దిన పత్రికలు కూడా సినిమా యాడ్స్ మీదనే ఆధారపడటం వల్ల భజన చేసి బాగా లేని చిత్రాన్ని కూడా బాగుందని రిపోర్ట్ చేసేవారు. ఇక స్టార్ హీరోల నిర్మాతలు ఇచ్చే ప్రకటనలలో కూడా అతిశయోక్తులు ఉండేవి. దాంతో నాటి జర్నలిస్ట్‌లు సినిమాలు ఫ్లాప్ అని తెలిసినా ఏమీ చేయలేని, నిజాలను చెప్పలేని పరిస్థితి.
కానీ సోషల్ మీడియా రాకతో ఏది నిజంగా బాగుంది? ఏ చిత్రం బాగాలేదు? ఎంత కలెక్ట్ చేసింది? వంటి విషయాలలో నిజాలు బయటకు వస్తున్నాయి. ఇంకా మార్పురావాల్సి వుంది. ఓవర్‌సీస్ మార్కెట్‌లోలాగా అసలైన కలెక్షన్లు ప్రేక్షకులకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇక నాడు స్రవంతి రవికిషోర్ నుంచి చాలా మంది సినీ పెద్దలు మొదటి రోజే సోషల్ మీడియాలో రివ్యూలు ఇవ్వకుండా ఓ వారం ఆగి ఇవ్వవచ్చు కదా! అని రిక్వెస్ట్ చేసేవారు. అసలు స్రవంతి రవికిషోర్‌తో పాటు పలువురికి సినిమాల పబ్లిసిటీలపై నమ్మకం లేదు. కేవలం మీరు బాగాలేదని చెప్పినంత మాత్రాన మా సినిమాలు ఆడకుండా పోతాయా? అనే వాదన వినిపించి బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా సందేహించేవారు. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా హవాతో మోహన్‌బాబు నుంచి దిల్‌రాజు, బన్నీ, హరీష్‌శంకర్ వంటి వారు రివ్యూలపై మండిపడుతున్నారు. సినిమా బాగున్నప్పుడు బాగుందని చెప్పిన విషయాన్ని మర్చిపోయి సినిమా బాగాలేకపోతే మా సినిమాపై రివ్యూల ఎఫెక్ట్ పడుతోందని వాదిస్తున్నారు.
ఇక మోహన్‌బాబు అయితే తాజాగా ఓ పాతిక మంది కూర్చుని సినిమా చూసి రివ్యూ ఇవ్వాలని చెప్పుకొచ్చాడు. ఇలా రివ్యూలపై నేడు నిర్మాతలు, దర్శక హీరోలు భుజాలు తడుముకుంటున్నారు. 'ఇంటెలిజెంట్, గాయత్రి'లు బాగా లేవని చెప్పిన మీడియానే 'ఫిదా, తొలి ప్రేమ' వంటి వాటికి పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన సంగతి మరవరాదు. ఎవరో ఒకరు లేక ఇద్దరు నిర్మాతల ఒత్తిళ్లకు , ప్రలోభాలకు తలొగ్గుతారే గానీ అందరు అలాగే ప్రలోభాలకు లొంగుతారని భావించడం అవివేకం. కోట్లలో సినిమా తీసే నిర్మాతది ఎంత కష్టమో, తనకు రోజుకి వచ్చే 300 రూపాయల సంపాదన నుంచి 200రూపాయలు టిక్కెట్‌కి ఖర్చుపెట్టడం కూడా అంత కష్టమే. ఇక తాజాగా నాని నిర్మించిన 'అ' చిత్రం విషయంలో 'బాహుబలి' నిర్మాత శోభుయార్లగడ్డ రివ్యూల విషయంలో చేసిన రిక్వెస్ట్ మాత్రం బాగుంది. ఏదో హడావుడిగా సినిమా చూస్తూనే వెంటనే ఎప్పటికప్పుడు రివ్యూల టైప్‌లో అప్‌డేట్స్ ఇవ్వడాన్ని మాత్రం ప్రోత్సహించకూడదు.
శోభు యార్లగడ్డ మాట్లాడుతూ, తొందరగా రివ్యూలు ఇవ్వాలని ఆరాట పడవద్దు. సినిమా మొత్తం చూసి ఆ తర్వాత రివ్యూలు ఇవ్వండి. 'అ' సినిమా ఒక యూనిక్ మూవీ. తెలుగు సినీ చరిత్రలోనే అద్భుతమైన ప్రయోగం. ఇక కాన్సెప్ట్ కోసం ఇంత మంది స్టార్స్ కలిశారంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి రివ్యూలు రాసేవారు సినిమా చూసి, అర్ధం చేసుకుని రివ్యూలు ఇవ్వమని కోరాడు. నిజంగా ఈయన మాటలను రివ్యూ రైటర్లు కూడా ఒప్పుకుంటారు.