వాస్తవానికి కర్ణాటకకు చెందిన వ్యక్తి అర్జున్ సర్జా. ఈయన తెలుగులోకి కోడిరామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన 'మా పల్లెలో గోపాలుడు'తో అదిరిపోయే హిట్‌ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకుని పలు చిత్రాలు చేశాడు. ఇందులో ఎన్నోహిట్స్ ఉన్నాయి. ఇక ఆయన నాడు సుమన్, భానుచందర్ వంటి వారికి పోటీగా నిలిచాడు. కానీ ఆ తర్వాత కోలీవుడ్‌పై దృష్టి పెట్టాడు. అక్కడ కమల్‌హాసన్ నుంచి అందరితో కలిసి నటించాడు. శంకర్ 'జెంటిల్‌మేన్, ఒకే ఒక్కడు'తో సంచలనాలు నమోదు చేశాడు. ఇక ఈయన కుమార్తెని కూడా హీరోయిన్‌ని చేశాడు. కొన్ని దేశభక్తి చిత్రాలకు దర్శకత్వం వహించి తన సత్తా చాటాడు. ఈయన నటించిన చిత్రాలన్నీ సాధారణంగా డబ్బింగ్ ద్వారా అయినా తెలుగులోకి వస్తూనే ఉంటాయి.
ఇక ఈయన ఇటీవల తన పాత్ర బాగా నచ్చితే ఎవరితోనైనా నటించేందుకు సిద్దం అని ప్రకటించాడు. నితిన్ నటించిన 'లై' చిత్రంలో అదరగొట్టాడు. ప్రస్తుతం స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ చేస్తోన్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'లో కూడా నటిస్తున్నాడు. ఇక ఈయన ప్రస్తుతం ఓ క్రేజీ తమిళ ప్రాజెక్ట్‌లో పవర్‌ఫుల్ విలన్ పాత్రను చేయడానికి రెడీ అయ్యాడు. గతంలో తమిళస్టార్ అజిత్‌తో కలిసి అర్జున్ 'మంగాత్తా' చిత్రంలో నటించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. ఇక అజిత్ త్వరలో 'వీరం, వేదాళం, వివేగం' చిత్రాల అనంతరం అదే దర్శకుడు శివ దర్శకత్వంలో 'విశ్వాసం' అనే చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. వచ్చేనెల ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 'వివేగం' చిత్రం పెద్ద హిట్ కాకపోయినా కలెక్షన్లు మాత్రం భారీగానే సాధించింది.
ఈ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి చిత్రమే 'విశ్వాసం' చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ఇక ఇందులో తమిళ లేడీ సూపర్‌స్టార్ నయనతార నటిస్తోంది. పవర్‌ఫుల్ విలన్ పాత్రను అర్జున్ చేయనుండగా, ఇందులో అజిత్ నార్త్ చెన్నై రౌడీగా కనిపించనున్నాడు. చాలా కాలం తర్వాత అజిత్ చిత్రంలో అర్జున్, నయనతారలు నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.