ఏప్రిల్ 27 విడుదల తేదీ నాదంటే నాదని భరత్ వర్సెస్ సూర్య లు నిన్నటిదాకా గొడవలు పడ్డారు. కానీ మధ్యలో రజినీకాంత్ ఎంటరై రోబో 2.0 సినిమా వస్తుందేమో అని అటు భరత్ నిర్మాతలు.. ఇటు సూర్య నిర్మాతలు కంగారు పడడమే కాదు 2.0 నిర్మాతలపైనా ఒంటికాలితో లేచారు. అయితే 2.0 ఏప్రిల్ నుండి డ్రాప్ అయ్యింది. ఇక భరత్, సూర్య నిర్మాతలు హమ్మయ్య అనుకునేలోపు... మళ్ళీ రజినీ 'కాలా' తో ఏప్రిల్ 27 న కన్ఫర్మ్ చేసుకునేసరికి మళ్లీ రగిలిపోయారు భరత్, సూర్య నిర్మాతలు. అందుకే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏప్రిల్ 26 నే వచ్చేస్తున్నామని అధికారిక ప్రకటన జారీ చేసినప్పటికీ వారి గుండెలు గుబేల్ గుబేల్ అంటూనే ఉన్నాయి.
మరి ఈ విషయంలో కేవలం భరత్ అనే నేను నిర్మాత దానయ్య, నా పేరు సూర్య నిర్మాతలైన బన్నీవాసులు పట్టు విడుపు లేకుండా ప్రవర్తిస్తున్నారు గాని.. వీరి వెనుక ఆయా సినిమాల హీరోలున్నారనేది జనం మాట. మరి దానయ్య కి, బన్నీ వాస్ కి ఎందుకంత ఈగోనో తెలియదు గాని ఇద్దరూ ఏప్రిల్ 26 నే విడుదల అంటూ డేట్ ఇచ్చేసారు. కానీ తాజాగా ఇప్పుడు ఆ ఇద్దరు నిర్మాతలు మధ్యన మెగాస్టార్ చిరు చర్చలు జరిపి ఆ సమస్యను ఒక కొలిక్కి తెచ్చినట్టుగా ఫిలింనగర్ టాక్. ఆ చర్చల ఫలితం మహేష్ ఏప్రిల్ 26 కన్నా ముందే అంటే ఏప్రిల్ 21 న భరత్ అనే నేను తో దిగడానికి రెడీ అవుతుంటే.. అల్లు అర్జున్ నా పేరు సూర్య ని ఏప్రిల్ 26 ని పోస్ట్ ఫోన్ చేసి మే 4కి మర్చారు.
మరి ఈ రెండు సినిమాల నిర్మాతలు ఈగో తగ్గించుకుని ఇలా తమ సినిమాల తేదీలను మార్చుకుని గొడవకు తెరదించారు. కానీ రజినీకాంత్ మాత్రం ఎప్పటిలాగే ఏప్రిల్ 27 నే తన కాలాని థియేటర్స్ లోకి దింపుతున్నారు. మరి మహేష్, అల్లు అర్జున్ సినిమాల విడుదల డేట్స్ గురించిన చర్చలు గత మూడు నెలలుగా మీడియాలో తెగ హైలెట్ అయ్యాయి. అలాగే నిర్మాతల ఈగోలకు అటు మహేష్ డిస్ట్రిబ్యూటర్స్, ఇటు అల్లు అర్జున్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా నష్టపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం మహేష్ తన సినిమాని ముందుగా థియేటర్స్లోకి దింపుతుంటే... అల్లు అర్జున్ కాస్త నెమ్మదించి మే 4 కి వస్తున్నాడు. ఈ లెక్కన రెండు సినిమాల నిర్మాతలకు మధ్యన రాజీ కుదిరినట్టే.