ఎన్నడులేని విధంగా ఇటీవల మెగామేనల్లుడు సాయిదరమ్‌తేజ్ నటించిన 'ఇంటెలిజెంట్', మెగా హీరో వరుణ్‌తేజ్ నటించిన 'తొలిప్రేమ' చిత్రాలు ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇందులో వరుణ్‌తేజ్ 'తొలిప్రేమ'నే విన్నర్‌గా నిలిచింది. ఇక వరుణ్‌తేజ్ 'కంచె, ఫిదా, తొలిప్రేమ'లతో మంచి హీరోగా పేరు తెచ్చుకుని ఏ పాత్రనైనా చేయగలడని నిరూపించుకుంటున్నాడు. 'ఫిదా, తొలిప్రేమ'లు ప్రేమకథా చిత్రాలు కాగా, ఆయన తన తదుపరి చిత్రంగా స్పేస్‌కి సంబంధించిన అంతరిక్ష వాసుల నేపధ్యంలో 'ఘాజీ' చిత్ర దర్శకుడు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో నటించనున్నాడు. ఇందుకోసం కజఖిస్తాన్ వెళ్లి శిక్షణ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. మరోవైపు అతి తక్కువ బడ్జెట్‌తో ఎంతో రిచ్‌గా సబ్‌మెరైన్ నేపధ్యంలో 'ఘాజీ' తీసిన సంకల్ప్‌రెడ్డి 'కంచె' తర్వాత మరో వెరైటీ చిత్రాన్ని వరుణ్‌తేజ్‌కి ఇవ్వడం ఖాయమైంది.
ఇక విషయానికి వస్తే ఈమధ్య అల్లుఅర్జున్ వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్నాడు. పవన్‌కళ్యాణ్ అభిమానులతో తగాదా పడ్డాడు. తాజాగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే చిత్రం చేస్తున్నాడు. దీనిని మొదట ఏప్రిల్ 27విడుదల అని ప్రకటించి ఒకరోజు ముందుగా ఏప్రిల్ 26నే రానున్నామని తెలిపాడు. మరోవైపు మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో చేసిన 'భరత్ అనే నేను' కూడా అదే డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. ఇక ఈ ఇద్దరి నిర్మాత మధ్య చిరంజీవి మధ్యవర్త్తిత్వం చేయనున్నాడు. దీని ప్రకారం మహేష్ 'భరత్ అనే నేను' చిత్రం ఏప్రిల్ 21న, 'నాపేరు సూర్య' చిత్రం మే 4న విడుదల కానున్నాయని సమాచారం. ఇక ఏప్రిల్27న రజనీ 'కాలా' రానుంది.
ఇక ఇప్పుడు మరో టైటిల్ విషయంలో కూడా బన్నీ వరుణ్‌తేజ్‌తో పోటీపడుతున్నాడు. బన్నీ 'నాపేరు సూర్య' తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో ఓ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం చేయాలని భావించినా, దానిని వద్దనుకుని క్రిష్ దర్శకత్వంలో 'వేదం' తర్వాత మరో చిత్రాన్ని ఓకే చేశాడు. క్రిష్ 'మణికర్ణిక', బన్నీ 'నాపేరు సూర్య'ల తర్వాత ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఎప్పుడు తనదైన పంధాలో టైటిల్స్ పెట్టే క్రిష్ బన్నీ చిత్రానికి 'అహం బ్రహ్మస్మి' టైటిల్‌ని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు సంకల్ప్‌రెడ్డి వరుణ్‌తేజ్‌తో చేయబోయే చిత్రానికి కూడా అదే టైటిల్‌ని అనుకుంటున్నాడు. మరి బన్నీ అడిగితే వరుణ్‌తేజ్ వదిలేస్తాడా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది.