అతిలోక సుందరి శ్రీదేవి అంటే వర్మకి ఎంత అభిమానమో చెప్పలేం. ఆమె మరణ వార్త విన్నప్పటి నుంచి ఆయన ట్వీట్స్ మీద ట్వీట్స్‌ని నిరవధికంగా చేస్తున్నాడు. తాజాగా ఆయన శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ అంటూ పోస్ట్ చేసిన ఉత్తరంలో పలు అంశాలను ప్రస్తావించారు. శ్రీదేవి నాలుగేళ్ల చిన్న ప్రాయం నుంచే బాలనటిగా మారింది. ఆమె అద్దాల మేడలో నివసించింది. ఇక ఈమె తండ్రి మరణం అనంతరం ఈమె పంజరంలోని చిలుకగా మారింది. శ్రీదేవి అమ్మ రాజ్యలక్ష్మికి పెద్దగా ఏమీ తెలియదు. దాంతో ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టి ఆర్ధికంగా మోసపోయారు.
శ్రీదేవి ఎంతో సున్నిత మనస్కురాలు. ఆమె గాజు గోడల మధ్యే జీవించింది. స్వేచ్చ అన్నా, సంతోషం అన్నా ఆమెకి తెలియదు. జీవితాంతం మానసిక అశాంతితోనే గడిపింది. ఇక శ్రీదేవి తల్లికి విదేశాలలో బ్రెయిన్‌కి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో ఆమె పిచ్చిది అయిపోయింది. ఆమె మరణిస్తూ ఆస్తులన్నీ శ్రీదేవి పేరిటే రాసింది. కానీ తన తల్లి మతిస్థిమితం లేక అలా రాసిందని, తనకు కూడా ఆ ఆస్తుల్లో వాటా ఉందని ఆమె సోదరి శ్రీలత కోర్టుకి ఎక్కింది. దాంతో శ్రీదేవి ఆస్థి మొత్తాన్ని ఆమెకే రాసిచ్చింది. నాడు ఆమె చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అదేసమయంలో బోనీకపూర్ కూడా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు.
దాంతో పెళ్లి తర్వాత కూడా ఆమెలో అశాంతి పెరిగిందే గానీ తగ్గలేదు. ఇక బోనీకపూర్‌ని మోనాకపూర్ నుంచి విడగొట్టిందనే కారణంగా బోనీ తల్లి శ్రీదేవిపై చేయిచేసుకుంది. అందం కాపాడు కోవడం కోసం ఆమె కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. ఆ విషయం ఐదారేళ్ల నుంచి ఆమెని చూస్తే అందరికీ అర్ధమవుతుంది ఇక కొంత కాలంగా తన కూతుర్ల విషయంపై ఆమె దృష్టిపెట్టింది. జీవితాంతం ఆమె అశాంతితోనే గడిపింది. మరి మరణం తర్వాత అయినా ఆమె మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను... అంటూ తన లేఖలో వర్మ తెలిపాడు.