నటి శ్రీదేవి మరణం తర్వాత ప్రతి వ్యక్తి సిగ్గుపడేలా మన మీడియా ప్రవర్తించింది. ఆమె మృతిని తమదైన విశ్లేషణలు, నానా రకాల అనుమానాలతో అందరినీ బాదించేలా ప్రవర్తించింది. దీనిపై రిషికపూర్ నుంచి కోనవెంకట్ వరకు అందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీదేవి మరణవార్త చెబుతూ, మన రిపోర్టర్స్, యాంకర్లు కూడా బాత్ టబ్‌లోకి దిగి రిపోర్ట్ చేశారు. మరొక చానెల్ శ్రీదేవి రక్తపు మడుగులో ఉన్న ఫొటోలను సృష్టించి ప్రచారం చేసింది. ఇక దుబాయ్ మీడియా కూడా ఇండియన్ మీడియా శ్రీదేవి విషయంలో చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులకు బాత్‌టబ్‌లు ఉండవు కాబట్టి ఏదేదో ఊహిస్తూ వార్తలు, కథనాలు వండుతున్నారని మండిపడింది. ఈ విషయంలో సాధారణంగా ఎప్పుడు మీడియా ముందుకు రాని సున్నిత మసస్కురాలైన అక్కినేని నాగార్జున శ్రీమతి అమలా కూడా స్పందించింది.
'నా జీవితాన్ని నాకు వదిలేయండి. వ్యక్తిగత స్వేచ్చని ఇవ్వండి. నిజం, లక్ష్యం వంటి అంశాల మధ్య బతికేందుకు అనుమతి ఇవ్వండి. నన్ను ఎందుకు అలిసిపోయావు? ఎందుకు బరువు పెరిగావని అడగకుండా నన్ను ప్రశాంతంగా బతకనిస్తారా? నా కంటి కింద నలుపు నేను కళ్లద్దాలు పెట్టుకోవడం వల్ల వచ్చింది. ముడతలు వయసుని బట్టి వస్తాయి. సైజ్‌జీరో వంటివి గుర్తు చేయకుండా నేను ప్రశాంతంగా కోరుకున్న దుస్తులు వేసుకోనివ్వండి. నాకెంత జుట్టు ఉంది అనే విషయాన్ని గుర్తిస్తారు గానీ నాకున్న జ్ఞానాన్ని గుర్తించరు. కెమెరాలు ఓ మనిషి వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా చూపించగలుగుతాయా? నేను ఎలా వంట చేస్తాను అని అడగకుండా నన్ను ప్రశాంతంగా అర్ధవంతమైన విషయాలపై చర్చించనిస్తారా? మార్పు వచ్చే విధంగా ఏదైనా విభిన్నంగా చేయాలని నేను ఆలోచిస్తున్నాను. భౌతికంగా నేను వెళ్లేలోపు నేను పూర్తి చేయని విషయాలను పూర్తి చేయాలని భావిస్తున్నాను. ప్రశాంతంగా నన్ను నా దారిలో నడవనిస్తారా? నా జీవితంలో ఓ మిషన్‌ని పూర్తి చేయాలని భావిస్తున్నాను. ఇతరులు కలుగజేసుకున్నప్పుడు నేను దానిని నెరవేర్చలేను. సామాజిక మాధ్యమాలలో లైకులు, కామెంట్స్, టీఆర్పీ రేటింగ్స్, బాక్సాఫీస్ పిచ్చి నుంచి నన్ను విముక్తి చేస్తారా?' అంటూ హృద్యమైన కామెంట్స్ చేసింది.
మరి ఇవి మన మీడియా వారి చెవులకి ఎక్కుతాయో లేదో వేచిచూడాల్సివుంది..!