తమిళ స్టార్స్ అయిన రజనీకాంత్, కమల్‌హాసన్, విక్రమ్ నుంచి సూర్య, కార్తి వరకు తెలుగులో మార్కెట్ తెచ్చుకుంటూ ఉంటే మన హీరోలు మాత్రం తమ మార్కెట్ పరిధి పెంచుకోవడం లేదని చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లు ఉన్న కాలంలో అనిపించేది. కానీ 'బాహుబలి'తో లెక్కలు మారాయి. నేడు ప్రభాస్, అల్లుఅర్జున్, మహేష్‌బాబు వంటి వారు కూడా పరభాషలపై కన్నేశారు. ఇక విషయానికి వస్తే కొన్ని చిత్రాల పరిస్థితి విభిన్నంగా, అంతుపట్టని విధంగా ఉంటుంది. మహేష్ నటించిన 'అతడు, ఖలేజా' చిత్రాలు కమర్షియల్ హిట్స్ కావు. కానీ ఆయా నిర్మాతలకు, వాటి శాటిలైట్ రైట్స్ తీసుకున్న చానెల్స్‌కి అవి జీవితాదాయంగా మారిపోయి ఎన్నిసార్లు టెలికాస్ట్ చేసినా కూడా టీఆర్పీలు బాగా వస్తూ ఉంటాయి.
ఇప్పుడు మహేష్ కెరీర్‌లోని మరో చిత్రం ఇదే కోవలోకి వచ్చి చేరింది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన 'స్పైడర్' చిత్రం హీరోయిజం తక్కువ కావడం, తమిళ వాసనలు ఎక్కువగా ఉన్నా కూడా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో జీ తెలుగులో ప్రసారం చేయగా, స్టార్ హీరోల చిత్రాలకు తగ్గట్లుగా కాకుండా అతి తక్కువగా 7 టీఆర్పీనే సాధించి, నిరాశపరిచింది. కానీ ఇదే చిత్రం తమిళ వెర్షన్‌ని సన్‌టీవీలో వేస్తే ఏకంగా 10.4 టీఆర్పీని సాధించడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీనిని బట్టి చూస్తే నిర్మాతలు ఈ చిత్రం తమిళ వెర్షన్‌ని థియేటికల్ వెర్షన్‌ని సినీ ప్రేక్షకులకు దగ్గర చేయడంలో ప్రమోషన్ పరంగా విఫలమయ్యారని అర్ధమవుతోంది. దీంతో ఈ చిత్రం రీ టెలికాస్ట్‌లో కూడా మంచి ఆదాయాలను తెచ్చిపెడుతుందని సన్ నెట్‌వర్క్ సంస్థ ఆనందంలో ఉంది.
మురుగదాస్ దర్శకత్వం, హారీస్‌జైరాజ్ సంగీతం, ఎస్‌జె సూర్య విలనీజంతో పాటు ఇందులో మహేష్ భాగస్వామ్యం కూడా ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. దీంతో ఆయన రాబోయే చిత్రం 'భరత్ అనే నేను' చిత్రం రైట్స్ కోసం పోటీ పడింది. ఇక 'స్పైడర్' చిత్రం టీఆర్పీ రేటింగ్‌లు 'బాహుబలి -ది కన్‌క్లూజన్'తో పాటు విజయ్ 'మెర్సల్' కంటే మెరుగ్గా రావడం మరింత ఆశ్చర్యకరం. ఈ విషయంలో మహేష్ స్టామినా మరోసారి నిరూపితమైంది.