మనదేశంలో నానాపాటేకర్, ఓంపురి, నసీరుద్దీన్‌షా, ప్రకాష్‌రాజ్, కోట, నాజర్ వంటి ఎందరో గొప్పనటులు ఉన్నారు. వారిలో రఘువరన్ ముఖ్యుడు. ఈయన తన కెరీర్ మొదట్లో హీరో పాత్రలు చేశాడు. తర్వాత విలన్‌గా మారాడు. చూడటానికి సన్నగా, బక్కగా ఉండే ఆయన తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్‌డెలివరీ ద్వారానే తన పాత్రను పండిస్తాడు. 'శివ' చిత్రంలో ఓ లారీ మనుషులు తీసుకెళ్లి ఏసెయ్... శివా..శివా.. శివా.. ఎవడ్రా శివ' అంటూ ఆయన చూపిన విలనిజం తెలుగు సినిమాలలో విలన్ల రూపురేఖలను మార్చివేశాయి. ఇక ఈయన 'పసివాడి ప్రాణం'లో విలన్‌గా, 'సుస్వాగతం'లో మంచి స్నేహితుడి వంటి ఫాదర్ పాత్రలు చేశాడు.
ఇలా ఈయన తన విలక్షణతను చాటుకున్నాడు. ఇక 'శివ' వచ్చే వరకు విలన్ అంటే కండలు, హైట్‌గా, కంటిపై గాయాలు, కత్తిగాటుతో కనిపించేవారు. కానీ ఈ చిత్రం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. 'భాషా' చిత్రంలో ఆయన నటన రజనీకి సరితూగే స్థాయిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక రఘువరన్ గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ, రఘువరన్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చూడటానికి బక్కపలచగా ఉన్నా ఆయన చూపే విలనిజం అద్భుతం. అదే రఘువరన్ అమ్మాయి అయి ఉంటే నేను పెళ్లి చేసుకునే వాడిని. ఆయనంటే అంత ఇష్టం.
ఆయనను చూసినప్పటి నుంచి విలన్ కావాలని కోరుకునే వాడిని. నేను యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా ఎప్పుడు కామెడీ సీన్స్ చేయలేదు. మరి కామెడీ హీరోగా ఎలా మారానో నాకే ఆశ్చర్యం వేస్తుంది అన్నాడు. ఇక అల్లరోడు కూడా ఎప్పటి నుంచో విలన్ పాత్ర చేయాలని ఉంది అంటున్నాడు. ఆయన నటించిన 'నేను'లో ఆ షేడ్స్ ఉంటాయి.