స్వర్గీయ ఎన్టీఆర్ సినీరంగం నుంచి రాజకీయాలలోకి వచ్చిన సమయంలో పలువురు కాంగ్రెస్ నేతలు సినిమాలో మొహాలకు రంగులేసుకునే వారికి రాజకీయాలేం తెలుసు? ఇంతకాలం ఆయన ఎందుకు సినిమాలలోకి రాలేదు? వయసు మీరిన తర్వాతనే రాజకీయాలలోకి ఎందుకు వస్తున్నాడు? సినిమాలలో తాను సంపాదించుకుంది దాచుకోవడానికే ఆయన రాజకీయాలలోకి వస్తున్నాడు... అంటూ పలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాట కూడా రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఇలాంటి విమర్శలే వస్తున్నాయి. ఇక తాజాగా వాటికి రజనీ ఘాటుగా జవాబిచ్చాడు. ఇప్పుడు నా వయసు 67ఏళ్లు, ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయడం లేదు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ నేతలు, ఇతర రాజకీయ నాయకులు నన్ను పదేపదే ఒక విషయం అడుగుతున్నారు. సినిమా నటులు మేకప్ తీసేసి రాజకీయాలలోకి రావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
రాజకీయ నేతలు తమ పనిని సరిగా నెరవేర్చడం లేదు కాబట్టే నేను ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చాను. ప్రస్తుతం తమిళనాడులో సరైన రాజకీయ నాయకుడంటూ ఎవ్వరూ లేరు. ఆలోటును నేను భర్తీ చేస్తాను. ఆ దేవుడు నావైపే ఉన్నాడు. మేము రాజకీయాలలోకి వస్తే పారదర్శక పాలనా అందిస్తాం.. రాజకీయాలంటే అంత ఈజీ కాదని నాకు బాగా తెలుసు అని అన్నారు. ఇక ప్రస్తుతం తమిళనాడులో రజనీ, కమల్ ఇద్దరు కనీసం డీఎంకేనైనా పరిగణనలోకి తీసుకుంటున్నారు గానీ శశికళ, దినకరన్, పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వంటి వారి మీద మాత్రం విరుచుకుపడే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రజనీపై వస్తున్న విమర్శలు చూస్తే నిన్నటి వరకు రజనీ రాజకీయాలలోకి ఎందుకు రాడు? ఆయనకు సినిమాలు, డబ్బులే ముఖ్యమా? అని ప్రశ్నిస్తూ వచ్చారు.
వారే ఇప్పుడు రజనీకి ఇప్పటికి రాజకీయాలలోకి రావడానికి సమయం దొరికిందా? సినిమాలలో సంపాదించిన దానిని కాపాడుకునేందుకే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడు... అంటూ రెండు నాల్కల ధోరణితో విమర్శిస్తున్నారు. 'ప్రతిధ్వని' చిత్రంలో పేపర్ మనదే కదా..! అంటూ పరుచూరి గోపాలకృష్ణ డబుల్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగానే ఇప్పటి రజనీ విషయంలో జరుగుతోంది. ఇక రజనీ ఈ వ్యాఖ్యలను డాక్టర్ ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో ఎంజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ చేయడం గమనార్హం.