రవితేజకి ఎనర్జిటిక్ హీరోగా పేరుంది. జస్ట్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హీరోలకు స్నేహితుడు కేరెక్టర్స్ చేసుకుంటూ ఉన్న రవితేజకి ముగ్గురు డైరెక్టర్స్ లైఫ్ నిచ్చారు. వారు శ్రీను వైట్ల, పూరి జగన్నాధ్, రాజమౌళి. వీరు ముగ్గురు రవితేజని హీరోగా నిలబెట్టారు. శ్రీను వైట్ల రవితేజతో చేసిన సినిమాల్లో మంచి హిట్స్ ఉన్నాయి. అయితే శ్రీను వైట్ల స్టార్ హీరోలతో సినిమాలు చేసే రేంజ్ నుండి ఇప్పుడు కిందకి జారిపోయాడు. వరుస వైఫల్యాలతో శ్రీను వైట్ల చాలా క్లిష్ట పరిస్థితుల్లో పడ్డాడు. అయితే తాజాగా శ్రీను వైట్లని ఆదుకోవడానికో.. లేదంటే కథ బాగా నచ్చో రవితేజ, శ్రీను వైట్ల డైరెక్షన్ లో 'అమర్ అక్బర్ ఆంథోనీ' అనే సినిమాని తాజాగా మొదలెట్టేశాడు.
ఈ సినిమాలో రవితేజకి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.... ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రల్లో రవితేజ కొడుకు మహాధన్ నటిస్తాడట. మరి రాజా ది గ్రేట్ లో మహాధన్ రవితేజ చిన్నప్పటి కేరెక్టర్ లో అద్భుతమైన నటన కనబరిచి అందరి మనసులను దోచుకున్నాడు. మరి ఈ సినిమాలో కూడా మహాధన్ పాత్ర చాలా ప్రత్యేకమంటున్నారు. అలాగే మరో సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోక కూడా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం కాబోతోంది. మరి లయ మ్యారేజ్ చేసుకుని ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది. అయితే ఈ మధ్యన లయ... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు లయ కూతురు శ్లోక సినిమా ఎంట్రీ హాట్ టాపిక్ అయ్యింది.
ఇక భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమా ఎక్కువ శాతం అంటే 80 శాతం అమెరికా వంటి భారీ లొకేషన్స్ లోనే జరగనుందట. ఇక ఈ సినిమాలో మహాధన్, శ్లోకలే కాదు కమెడియన్ కమ్ హీరో సునీల్ కూడా ఒక కీలకమైన పాత్రను చేస్తుండటం విశేషం. అయితే అది కమెడియన్ గానా లేదంటే.. మరేదన్నా పాత్ర అనేది మాత్రం తెలియాల్సి ఉంది.