తమిళనాడులో ఇప్పటికే ఖుష్బూ, రాధికాశరత్‌కుమార్ వంటి వారు రాజకీయాలలో ఉన్నారు. ఇక నమిత వంటి వారు కూడా రాజకీయ రంగప్రవేశానికి దారులు వెతుక్కుంటున్నారు. ఆమద్య సుకన్య తాను కూడా రాజకీయాలలోకి వస్తానని చెప్పి కమల్, రజనీలను ఏవేవో విమర్శించింది. ఇక సుహాసిని అయితే కేవలం హీరోలు మాత్రమే రాజకీయాలలోకి రావాలా? మేము రాకూడదా? హీరోలకే పట్టం కడతారా? మమ్మల్ని మీడియా, ప్రేక్షకులు ఎందుకు పట్టించుకోరు? అని ప్రశ్నించింది. ఇక ఇప్పుడు ఆ కోవలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ వచ్చింది.
ఈమె శరత్‌కుమార్ మొదటి భార్య కూతురు. ఇక ఈమె సవతి అమ్మ రాధిక, ఆమె తండ్రి ఎం.ఆర్.రాధా వంటి వారు రాజకీయాలలో ప్రవేశం ఉన్నవారే. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ తనని ఓ మీడియా ప్రతినిధి 'మరలా ఎప్పుడు కలుద్దాం' అని కాస్టింగ్ కౌచ్ కి పాల్పడ్డాడని చెప్పి సంచలనం సృష్టించింది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని వారికే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని, సినీ వారసురాళ్లకి ఇలాంటివి ఎదురు కావనేది నిజం కాదని, వారికి కూడా ఇలాంటివి ఎదురవుతుంటాయని వరలక్ష్మి బహిరంగంగా తెలిపింది. ఇక ఈమె శరత్‌కుమార్ కుమార్తె అయినా కూడా ఆయాచితంగా స్టార్ హీరోయిన్ కాలేదు. ఆమె నటించిన మొదటి చిత్రం బాగా ఆడలేదు. రెండో చిత్రం సగంలో ఆగిపోయింది. ఆ స్థాయి నుంచి ఆమె నేడు 9 చిత్రాలలో బిజీబిజీగా ఉంది.
ఇక ఈమె మహిళల కోసం 'సేవ్ శక్తి' అనే స్వచ్చంద సంస్థను స్థాపించి పలు సేవా కార్యక్రమాలను చేస్తోంది. తాజాగా ఉత్తర చెన్నైలో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎప్పుడు రాజకీయాలలోకి వస్తానో చెప్పలేను గానీ రాజకీయాలలోకి రావడం మాత్రం పక్కా అని తేల్చిచెప్పింది. కమల్, రజనీ... ఇలా ఎవరికైనా రాజకీయాలలోకి వచ్చే హక్కు ఉందని, సినిమాల ద్వారా తెచ్చుకున్న క్రేజ్, పవర్‌ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలను కోవడం తప్పుకాదని చెప్పింది. నన్నడితే ఊరిలోని అందరినీ రాజకీయాలలోకి రమ్మంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఇక విశాల్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ, ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై నేను చెప్పడానికి ఏమీ లేదు. విద్యలో మార్పులు రావాలి. పాఠశాల విద్య నుంచే ఆత్మరక్షణ విద్య, సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి... అని చెప్పుకొచ్చింది. ఇక కొంతకాలం కిందట ఈమె తండ్రి శరత్‌కుమార్, సవతితల్లి రాధికకు విశాల్‌తో గొడవలు, వరలక్ష్మితో విశాల్ ప్రేమాయణం వంటి వాటి ద్వారా కూడా ఈమె పాపులర్ అయింది. ఇక నడిగర్‌సంఘం కోసం నిర్మిస్తున్న కళ్యాణమండపంలో మొదట తమ పెళ్లేనని నాడు విశాల్ ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. కానీ ఇప్పటి పరిస్థితులు చూస్తే ఇద్దరి మద్య ఏవో బేధాభిప్రాయాలు వచ్చాయని అర్ధమవుతోంది.