ఈ మధ్యకాలంలో బ్యాంకులని మోసం చేయడం అంటే చిటికెలో పనిగా తయారైంది. విజయ్‌మాల్యా నుంచి నీరవ్ మోడీ వరకు, సుజనా చౌదరి నుంచి ఎందరో బ్యాంకులకి రుణాలు ఎగ్గొడుతున్నారు. వీటిల్లో వేల కోట్లు కూడా ఉన్నాయి. చివరకు జగన్, గాలి జనార్ధన్‌రెడ్డిలు కూడా ఇలాగే బ్యాంకులను మోసగించడం, రుణాలు ఎగవేయడంలో ముందుంటున్నారు. బ్యాంకులు కూడా రైతులను, సామాన్యులను పదివేలు రుణం ఇచ్చేందుకు నానా తిప్పలు పెట్టి, తిప్పించుకుని రుణాలు ఇస్తాయి. వాటిని చెల్లించడంలో కాస్త ఆలస్యమైనా కూడా పోలీసులకు ఫిర్యాదులు, అరెస్ట్‌లు, బలవంతపు వసూళ్లు, వేలాలు చేపడుతున్నారు.
కానీ వేల కోట్లు ఎగ్గొట్టే వారిపై మాత్రం చీమ వాలదు. వారికి ఎలా రుణం ఎగ్గొట్టాలో, ఎలా విదేశాలకు వెళ్లాలో సూచనలు, సలహాలు ఇచ్చేది కూడా బ్యాంకు అధికారులు, ఇతర ఆడిటర్స్, వారి న్యాయవాదులు వంటి వారే కావడం విశేషం. ఇటీవల నోట్ల రద్దు పుణ్యామా అని మోదీజీ పుణ్యాన నల్లడబ్బు పోగుచేసుకున్న వారు హాయిగా వాటిని తెల్లడబ్బుగా మార్చుకున్నారు. ఈ నోట్ల రద్దు వల్ల దేశానికి, ప్రభుత్వానికి ఎంత నల్ల సొమ్ము వచ్చిందో? నోట్ల రద్దు వల్ల ఏం మేలు జరిగింది? అనేది మోదీ ప్రభుత్వం చెప్పలేకపోతోంది.
ఇక చిదంబరం నుంచి లలిత్‌మోదీ దాకా అందరు బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి ప్రజల సొమ్ముతో జల్సాలు చేసి, పెద్ద మనుషులుగా తయారైన వారే. ఇక నోట్ల రద్దు సమయంలో భారీగా మనీ లాండరింగ్ జరిగిందని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ వీరి నుంచి రుణ సొమ్మును వసూలు చేయడం చేతకాని నిర్జీవ వ్యవస్థ, నాయకులు మన వారు. ఇక తాజాగా ఓ హీరోయిన్ కూడా ఇదే పని చేసింది. కృష్ణవంశీ 'చందమామ' చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో కలిసి నటించిన సింధుమీనన్ ఈసారి ఓ బ్యాంకుకి ఏకంగా 30లక్షలు ఎగ్గొట్టింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు ఆమెపై, ఆమె ముగ్గురు సోదరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆమె బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 36లక్షల రుణం తీసుకుంది. వాటిని చెల్లించలేదు.
ఇంతకాలం చెల్లించకపోయిన తర్వాత మాత్రమే పాపం మన బ్యాంకు అధికారులకు ఆమె తాకట్టు పెట్టిన ఆస్థి కూడా పత్రాలు కూడా నకలీవని తెలిసి వచ్చాయి. సింధుమీనన్‌ని అరెస్ట్ చేయాలని భావిస్తే ఆమె విదేశాలలో ఉండటంతో అది వీలుకాలేదు. దాంతో ఆమె సోదరుడు కార్తికేయన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఈమె ఆ మొత్తం చెల్లిస్తుందా? లేదా? అనేది చూడాలి నిజంగా దేశంలో వేల కోట్లు ఎగ్గొట్టిన వారికంటే ఈమె మొత్తం తక్కువే అయినా బ్యాంకు అధికారులను తమ గిఫ్ట్‌లు, ఇతర మార్గాల ద్వారా ఎలా దారిలోకి తెచ్చుకోవచ్చో వీరిని చూసి మనం నేర్చుకోవాలి....!