కేవలం రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడానికే ఎందరో ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ ఎంపీ వంటి వాటిని సాధించడం కోసం ఎన్నో పార్టీలతో మంతనాలు జరిపి, పార్టీలకు విరాళాలు ఇచ్చి, పలు విధాలుగా ఆయా పార్టీల అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారు టి.సుబ్బరామిరెడ్డి. తాజాగా నెల్లూరుకు చెందిన వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కాబోతున్న అపరకుభేరుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం రమేష్, సుజనా చౌదరిలు తెర వెనుక ఎంతో కాలం మంతనాలు జరిపితే గానీ ఎంపీలు కాలేకపోయారు. అలాంటిది పవన్‌కళ్యాణ్‌కి రాజకీయంగా ఇప్పటికే పలు చాన్స్‌లు వచ్చాయి. ఆయన ఊ అని ఉంటే టిడిపి రాజ్యసభకి పంపేది. లేదా లోక్‌సభ ఎంపీ సీటుని ఆయన కోరుకున్న స్థానానికి ఇచ్చేది కానీ పవన్ వాటిని కాదనుకున్నాడు.
ఇక ఇప్పుడు పవన్ నిజమైన పొలిటికల్ హీరోగా నిలవడానికి మరో మంచి చాన్స్ వచ్చింది. మరి దానిని ఆయన తన రాజకీయ చాణక్యతతో వాడుకుంటాడా? దానిని కూడా తిరస్కరిస్తాడా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏదిఏమైనా నేటి రోజుల్లో రాజకీయాలలో అధికారంలో ఉండటమే ముఖ్యం. రాజకీయాలలోకి రాకుండా కూడా ప్రజా సేవ చేయవచ్చు. కానీ పవన్ పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇలాంటి సమయంలో ఆయన తన భవిష్యత్తును తానే తీర్చుదిద్దుకునే సదవకాశం ముందుంది. అదే ప్రత్యేకహోదా. నిజానికి ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డుతో పోల్చి పవన్ నాడు మొదటి సారి బిజెపిపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. వైజాగ్ బీచ్‌లో సభకి పిలుపునిచ్చాడు. దానికి ఆయన అభిమానులు ఎంతో కష్టనష్టాలకు ఓర్చి వచ్చారు. చివరకు ఆ నినాదాన్ని తన సొంతం చేసుకునేందుకు జగన్ కూడా వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో నాటకాలు వేశాడు. కానీ పిలుపినిచ్చిన నాయకులు పవన్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉండి పక్కరోజు ప్రెస్‌మీట్ పెట్టడం ఆయనకు పెద్ద మైనస్‌గా మారింది.
ఇక ఇప్పుడు మరోసారి ప్రత్యేకహోదా విషయం తెరమీదకి వచ్చింది. మిగిలిన పార్టీలు రాబోయే రాజకీయ ఉపయోగం కోసం తాత్కాలికంగానే ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలో ఉన్న సీఎం కావడంతో బిజెపిని తీవ్ర స్థాయిలో విమర్శించలేకపోతున్నాడు. ఇక బిజెపిపై అవిశ్వాసం పెడతామని చెబుతూనే, మోదీకి మద్దతు ఇస్తామని, ప్రత్యేకహోదా ఇవ్వగలిగింది మోడీ మాత్రమే అని జగన్ నాటకాలాడుతున్నాడు. ఈ సందర్భంగా పవన్ తన కార్యచరణను ప్రకటించాడు. ఆమరణ నిరాహారదీక్ష చేసి, తెలంగాణలో కేసీఆర్‌లా తన నిబద్దత చాటుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇప్పుడు ఏపీ ప్రజలు కేవలం నిజాయితీగా, నిబద్దతతో ప్రత్యేకహోదా కోసం పోరాడే నాయుడి కోసం ఎదురు చూస్తున్నారన్న మాట వాస్తవం. దీనిని పవన్ మొదటగా తన భుజాలకు ఎత్తుకుంటే ఆయన రియల్ హీరో అయ్యే చాన్స్ ఉంది..!