సాధారణంగా సెలబ్రిటీలకు ఎన్ని సుఖాలు ఉంటాయో అన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఎవరో వచ్చి ఆయన లేదా ఆమె కుమారుడిని నేనే అని స్టేట్‌మెంట్ ఇస్తారు. దాంతో బ్రేకింగ్ న్యూస్‌ల కోసం కాచుకుని కూర్చొని ఉండే మీడియా దానికి నానా హడావుడి చేస్తోంది. ఇక కొందరైతే కేవలం మీడియా దృష్టిలో పడేందుకు, తాము కూడా సెలబ్రిటీలుగా మారేందుకు కూడా ఇలా చేస్తూ ఉంటారు. ఇక నాడు ధనుష్‌కి తామే తల్లిదండ్రులమని ఓ వృద్దదంపతులు, మాజీ గవర్నర్ ఎన్.డి.తివారి కుమారుడిని అని ఓవ్యక్తి, జయలలిత కూతురిని తానేనని మరో యువతి మీడియా ముందుకు వచ్చారు. ఇక తాము తల్లిదండ్రులమని, లేదా వారి పిల్లలమని ప్రకటిస్తే కనీసం నిజనిర్ధారణ చేయడానికి డీఎన్‌ఏ వంటి టెస్ట్‌లైనా ఉన్నాయి.
కానీ తాను ఓ హీరో భార్యని అని సంచలనం సృష్టిస్తే దానికి ఆధారాలు, వాటిని నిరూపించడం సామాన్యంగా సాధ్యం కాదు. తాజాగా ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ డిజైరబుల్ బ్యాచ్‌లర్‌గా పేరు తెచ్చుకున్న సల్మాన్‌ఖాన్‌కి తాను భార్యనని ఓ మహిళ నానా హంగామా చేసిన ఘటన సంచలనం సృష్టించి వార్తల్లోకి ఎక్కింది. సల్మాన్ నా భర్త అంటూ ఓ వీరాభిమాని హల్‌చల్ చేసింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో తాజాగా ఈ ఘటన జరిగింది. అక్కడి సెక్యూరిటీ కళ్లుగప్పి ఆమె అపార్ట్‌మెంట్ పైభాగానికి చేరుకుంది. సల్మాన్ నా భర్త అంటూ కేకలు వేసింది. అంత సెక్యూరిటీ కళ్లు గప్పి ఆమె అలా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లగలగడం సంచలనం సృష్టించింది. ఆలారం మోగడంతో పాటు వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఆ యువతి చేతిలో ఇనుప రాడ్దు ఉండటంతో సెక్యూరిటీ భయపడ్డారు. పైగా తన వద్దకు వస్తే చనిపోతానని ఆమె బెదిరించింది.
దాంతో సెక్యూరిటీ సిబ్బంది అగ్నిమాపక దళానికి, సమాచారం అందించడంతో వారు అపార్ట్‌మెంట్‌కి చేరుకుని ఆ యువతికి నచ్చజెప్పి కిందకు దించారు. ఇంత జరిగినా దీనికి సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ నమోదు కాకపోవడం గమనార్హం. ఇక ఈ యువతి ఆ సమయంలో సల్మాన్ తన అపార్ట్‌మెంట్‌లోనే ఉన్నాడని భావించింది. కానీ సల్మాన్ మాత్రం 'రేస్ 3' చిత్రం కోసం అబుదాబిలో ఉన్నాడు. ఇక సల్మాన్‌కి దేశవ్యాప్తంగా లేడీస్ ఫాలోయింగ్ విపరీతం. మరి ఈ యువతి సల్మాన్‌కి వీరాభిమానా? లేక మతిస్థిమితం లేని మహిళా? అనేది తెలియాల్సివుంది.