ఏరంగంలోనైనా, మరీ ముఖ్యంగా సినిమా రంగంలో క్రేజ్ ఉన్నంతవరకే వారిని అందరు దగ్గరకు తీస్తారు. వారికి అండదండలు అందిస్తారు. కానీ క్రేజ్ కోల్పోయి, ఫేడవుట్ అయితే నాడు నెత్తిన పెట్టుకున్న వారే వారి మొహం కూడా చూడటానికి ఇష్టపడరు. ఎన్టీఆర్, ఏయన్నార్‌ల కాలం కంటే ముందు తెలుగులో ఇంకా చెప్పాలంటే దక్షిణాదిలోనే తొలి సూపర్‌స్టార్‌గా నాడు లక్షకు పైగా పారితోషికం తీసుకున్న చిత్తూరు నాగయ్య, కాంచనమాల వంటి వారు చివరి రోజుల్లో దయనీయమైన స్థితిని అనుభవించారు. ఇక సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే తరహాలో పద్మనాభం, బాలీవుడ్‌లో నర్గీస్, కాంతారావు, గుండు హనుమంతరావు, ఐరన్‌లెగ్ శాస్త్రి, కల్పనారాయ్ వంటి వారు మూడు పూటలా తిండి కోసం నానా తంటాలు పడ్డారు. ఇక నాగయ్య మరణించిన తర్వాత ఆయన దహన సంస్కారాలకు నాటి ఎమ్జీఆర్ ఆరువేలు విరాళంగా ఇచ్చిన తర్వాత గానీ దహన సంస్కారాలు జరగలేదు. అదే నాగయ్య, కాంచనమాల వంటి వారు నాడు సినిమాల మీద ఆసక్తితో మద్రాస్ సెంట్రల్ స్టేషన్‌లో రైలు దిగిన వారందరూ తాము ఉండటానికి నీడ, తిండి కోసం నాగయ్య దగ్గరే ఉండేవారు. ఇలాంటి వారి కోసం ఆయన ఓ పెద్ద భవంతిని ఏర్పాటు చేసి వచ్చే పోయే వాళ్లకి టీ, కాఫీలు, టిఫిన్లు, భోజనాలు ఇలా అన్ని సమకూర్చి పెట్టేవారు. ఇక రాజనాల అయితే షుగర్ వల్ల కాలు తీసేస్తే అడుక్కుని జీవించాడు. ఆయన నాటి రోజుల్లో ఎన్ట్టీఆర్, ఏయన్నార్‌లకు ధీటుగా రాణించి, టాప్ నటునిగా తాను డిమాండ్ చేసినంత పారితోషికం పుచ్చుకున్నాడు. ఇలా ఎందరో మనకి ఉదాహరణగా కనిపిస్తారు.
కానీ ముందు నుంచి డబ్బుల విషయంలో శోభన్‌బాబు, ఎన్టీఆర్, ఏయన్నార్, మురళీమోహన్, చంద్రమోహన్ వంటి వారు ఎంతో జాగ్రత్తగా ఉండి కోట్లకు అధిపతులు అయ్యారు. ఇక విషయానికి వస్తే 1995లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ నటించిన 'వీర్‌గతి' చిత్రంలో నటించిన నటీమణి పూజా దడ్వాల్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది. ఆమెకి టిబి సోకిందని వైద్యులు నిర్ధారించారు. దాంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు ఆమెని ఒంటరిగా విడిచి వెళ్లిపోయారు. గత 15రోజులుగా ఆమె ముంబైలోని సెవ్రీలో ఉన్న టిబి అసుపత్రిలో ఒంటరిగా ట్రీట్‌మెంట్ తీసుకుంటూ ఉంది. అయితే ఒంటరిగా ఉన్న తనకు ఎవ్వరూ తోడులేరని, చికిత్స చేయించుకునేందుకు కూడా తన వద్ద డబ్బులు లేవని ఆమె కన్నీరు మున్నీరు అవుతోంది. సాయం కోసం సల్మాన్‌ని కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదని ఆమె రోధిస్తోంది. తన బాధ గురించి తెలిస్తే ఆయన తనకు సాయం చేస్తాడనే గట్టి నమ్మకంతో ఉంది. చాలా కాలం గోవాలో క్యాసినోని నడిపానని, తన వద్ద ప్రస్తుతం డబ్బులే లేవని, టీ కోసం కూడా అందరిని బతిమాలి, అడుక్కుంటున్నానని చెబుతున్న ఆమె మాటలు దయనీయంగా ఉన్నాయి. ఇక ఈమె 'వీర్‌గతి' చిత్రంలో అతుల్ అగ్నిహోత్రి సరసన నటించింది. అలాగే 'హిందుస్థాన్, దబ్‌దబా, సింధూర్‌కి సౌగండ్' వంటి చిత్రాలలో కూడా ఆమె నటించింది.