పవన్‌కళ్యాణ్‌ని తమకు సాయం చేసే ఓ ఆయుధంగా చంద్రబాబు సర్కార్, టిడిపీలు భావిస్తూ వచ్చాయి. ఎలాగూ పవన్ తెలుగుదేశంకి మద్దతు ఇవ్వక తప్పదని భావించాయి. కానీ పవన్ మాత్రం జనసేన ఆవిర్భావ సభలో ఎవ్వరూ ఊహించని విధంగా చంద్రబాబు మరీ ముఖ్యంగా నారాలోకేష్‌పై నిప్పులు చెరగడంతో టిడిపి నేతలు షాక్‌కి గురయ్యారు. ఆ షాక్ నుంచి వారు ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదు. ఇక దీనికి టిడిపి నాయకులు చేస్తున్న సహనం కోల్పోయిన మాటలే ఉదాహరణ. ప్రపంచంలో నిజమైన ప్రతి విషయానికి ఆధారాలు ఉండకపోవచ్చు. ఆధారాలు లేకపోయినంత మాత్రాన అది నిజం కాకుండా పోదు. ఇక టిడిపి నేతలు జగన్‌ని లక్షల కోట్లు స్కాం చేశాడని, తమకి ఆ రోజు ప్రెస్‌మీట్‌లో ఏ అంకె గుర్తుకు వస్తే ఆ అంకెను చెబుతున్నారు. అయినా జగన్ ఇంకా నిందితుడు మాత్రమే. ఆయన నేరస్తునిగా ప్రూవ్ కాలేదు. మరి టిడిపి నేతలు జగన్‌ని అవినీతిపరుడు, దోషి అని ఎలా మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడటాన్ని జగన్ ఎందుకు సమర్ధవంతంగా ఎదుర్కొలేక పోతున్నాడు అనేది సందేహం. ఇది కేవలం జగన్ అనుభవ రాహిత్యమే. ఆయనే మంచి తెలివైన వాడు అయి ఉంటే తనని లక్షల కోట్లు అవినీతి చేశాడని ఆరోపిస్తున్న టిడిపి నాయకులపై పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగే అవకాశాలు ఉన్నా జగన్ మాత్రం దానిని చేయలేకపోతున్నాడు. ఇక పవన్ నారాలోకేష్‌ని విమర్శించడంపై టిడిపి సీనియర్ నేత వర్లరామయ్య అర్ధరహితమైన వ్యాఖ్యలు చేశాడు. తాను పవన్ నటించిన 'అత్తారింటికిదారేది' చిత్రాన్ని ఎన్నిసార్లు చూశానో గుర్తులేదు. నా కారులో కూడా ఆ సీడీ ఉంటుంది. కానీ పవన్ నారా లోకేష్‌పై అర్ధరహితమైన విమర్శలు చేయడంతో నేను తాజాగా ఈ సీడీని నా కారులోంచి బయట పడేశాను. మిస్టర్ పవన్‌కళ్యాణ్? ఎవరిమెప్పు కోసం నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు? శేఖర్‌రెడ్డి అవినీతిలో లోకేష్‌కి పాత్ర ఉందని మోదీ నీకు చెవిలో చెప్పాడా? ఏంటీ తమాషా? నిలకడలేని మనస్తత్వం నీది.
ఈ విషయం రాజకీయ నాయకులకు, సినిమా వారికి, అభిమానులకు, ప్రేక్షకులకు అందరికీ తెలుసు. లోకేష్ అవినీతి చేశాడని అంటావా? అవినీతి చేయాల్సిన అవసరం ఆ బాబుకి ఏముంది? నీ గురించి కూడా నేను చాలా విన్నాను. కానీ ఆధారాలు లేకుండా మాట్లాడను. ఏమైనా ఆరోపణలు చేసినప్పుడు ఎవిడెన్స్‌ఉండాలి తమ్ముడు పవన్.తప్పు నాయనా అలా మాట్లాడకూడదు. పైకిరావాల్సిన వాడిని.. నీకు ఎన్నో ఆశలు ఉన్నాయి. నీవుచాలా ఊహించుకుంటున్నావు. నీ కలలు నెరవేరాలంటే జాగ్రత్తగా ఉండాలి. మీ అన్న చిరంజీవి ఏమయ్యాడు తమ్ముడు? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈయన దృష్టిలో లోకేష్ నోటిలో వేలు పెట్టినా కొరకలేని అమాయకుడు. అవినీతి చేయాల్సిన అవసరం ఆ బాబుకి ఏముంది? అని అంటున్నాడు. అంటే అవినీతి చేయడానికి ఏవైనా ప్రత్యేక అర్హతలు ఉన్నాయా? మరి జగన్‌ని అవినీతి చేశాడని మీరు ఎలా చెబుతారు? ఓటుకు నోటు కేసు విషయం నిజం ఏమిటి? వైజాగ్ భూకుంభకోణంలో టిడిపి నాయకుల పాత్ర ఎంత? దీనిలో లోకేష్, గంటా శ్రీనివాసరావుల ప్రమేయం ఉందని ఆ ప్రాంత ప్రజలే కాదు.. టిడిపి నాయకులు కూడా భావిస్తున్నారు. మురళీమోహన్, నారాయణ వంటి వారి విజ్ఞానం ఏమిటి? పవన్ అజ్ఞాని అనే అనుకుందాం. నిలకడ లేని మనిషే అని ఒప్పుకుందాం. అంటే తెలివికి, నిలకడకు అవినీతి తెలివితేటలు అర్హతా? మురళీమోహన్, గంటా, నారాయణ లాగా స్పెషలైజేషన్ ఏమైనా చేయాలా? అసలు పవన్ మీద అలిగి 'అత్తారింటికి దారేది' సీడీ పడేశానని చెబుతున్న ఆయన వ్యాఖ్యలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయన్న విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. అయినా మంచిపని చేస్తే పొగిడిన వారు చెడు పనిచేస్తే అదే వ్యక్తిని విమర్శిస్తే అది నిలకడలేని మనస్తత్వం అవుతుందా? అన్నదే ప్రశ్న.