నాగ చైతన్య కి దగ్గుబాటి ఫ్యామిలీ ఏమవుతుందో అందరికి తెలిసిందే. నాగ చైతన్యకి రామానాయుడు తాతయ్య, ఆయన భార్య అమ్మమ్మ. అంటే సురేష్ బాబు, వెంకటేష్ లు నాగ చైతన్యకి మేన మామలు. అలాగే వెంకటేష్ - నాగ చైతన్యలు మామా అల్లుళ్ళు. అయితే ఇన్నాళ్ళకి వెంకటేష్ - నాగ చైతన్యలు కలిసి అక్కినేని - దగ్గుబాటి మల్టీస్టారర్ చెయ్యబోతున్నారు. ఇంతకుముందు 'ప్రేమమ్' సినిమాలో వెంకీ, నాగ చైతన్యకి మామయ్యగా చిన్న గెస్ట్ రోల్ చేశాడు. ఇప్పుడు చైతు, వెంకీలు కలిసి ఒక మూవీలో ఫుల్ లెన్త్ రోల్స్ చెయ్యనున్నారు.
బాబీ దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించే ఈ మల్టీస్టారర్ లో వెంకటేష్ మామయ్యగా, నాగ చైతన్య అల్లుడిలా నటిస్తున్నారట. మరి వీరిద్దరూ నిజజీవిత పాత్రలే మళ్ళీ సినిమాలో కూడా పోషిస్తున్నారన్నమాట. మరి 'జై లవ కుశ' తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు బాబీ ఆ సినిమా తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ కావడం, వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం... అలాగే నాగ చైతన్య మొదటిసారి మామయ్య సురేష్ బాబు బ్యానర్ లో నటించడం వంటి అంశాలతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పటికే వెంకీ, చైతుకి, బాబీకి మధ్యన కథా చర్చలు పూర్తయ్యాయని... నాగ చైతన్యకి, వెంకటేష్ లకు తమ పాత్రలు నచ్చి వెంటనే ఈ సినిమా ఓకే చేశారనే టాక్ వుంది.
మరి ప్రస్తుతం చైతు 'సవ్యసాచి' సినిమాతోనూ, మారుతీ డైరెక్షన్ లో 'శైలజ రెడ్డి అల్లుడి'తో పాటు, తన భార్య సమంతతో కలిసి 'ప్రేయసి' చిత్రంలోనూ నటిస్తున్నాడు. మరోవైపు వెంకటేష్ కూడా తేజ దర్శకత్వంలో 'ఆట నాదే వేట నాదే' అనే సినిమాని పట్టాలెక్కించాడు. మరి ఈ సినిమాలన్నీ పూర్తయ్యే వరకు బాబీ దర్శకత్వంలోని చైతు, వెంకీ ల మల్టీస్టారర్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఏమాత్రం లేదు. చూద్దాం ఈ మల్టీస్టారర్ ఎప్పుడు మొదలవ్వబోతుందో అనేది.