ప్రతి రంగంలోనూ మంచి చెడులు ఉంటాయి. సినిమా వారికైతే మంచి కంటే చెడు బాగా కనిపిస్తుంది. ఎవరో ఒకటి అరా అలా చేస్తున్నారని చెప్పి ఆ వృత్తిలో ఉన్నవారందరు అలాంటి వారే అన్నట్లుగా పాత్రలను రూపొందిస్తూ ఉంటారు. ఇక రాజకీయనాయకులు, ఉద్యోగస్థులను, పోలీస్‌లను, లాయర్లను, డాక్టర్లను.. ఇలా అందరి మీద వీరు సెటైర్లు వేస్తుంటారు. ఏమిటి అంటే సమాజంలో జరుగుతున్నదే కదా చూపిస్తున్నాం. మేము నిజాన్ని చూపిస్తున్నప్పుడు మీకెందుకు ఇబ్బంది అంటారు. ఇక కొందరైతే రాజకీయ నాయకులను ఫూల్స్ అని, రాస్కెల్స్ అని కూడా అంటూ ఉంటారు. అవి అందరినీ ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు కాదు. మరి రాజకీయ నాయకుల్లో 99శాతం ఫూల్స్ ఉన్నారని మోహన్‌బాబు, మైక్ ముందుపెడితే చాలు రాజకీయనాయకులపై మండిపడే పోసాని, శివాజీ వంటి వారు ఎవరి గురించైనా ఏ విమర్శ చేసినా, సెటైర్లు వేసినా అది తప్పు కాదంటారు సినిమా వారు.
ఇలా మనోభావాల పేరుతో ఇబ్బందులు పెడితే తమ క్రియేటివిటీ పోతుందని తెగ బాధపడిపోతుంటారు. నేటిరోజుల్లో సినిమాలు తీయడమే కష్టమైపోతోందని, ఏం తీస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అన్న పరిస్థితుల్లో తాము క్రియేటివిటీనీ, స్వేచ్చను, ఈ ప్రజాస్వామ్యంలో తమకున్న ప్రీడమ్‌ని ఇతరులు లాగేసుకుంటున్నారని అంటారు. అదే మీడియానో, మరోకరో సినిమా వారి గురించి చెడుగా మాట్లాడితే మాత్రం దానిని కూడా కేవలం కొందరిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారని, తమలో తప్పులేనప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుము కోవడం ఎందుకో అర్ధం కాదు.
నిజానికి మీడియా, సినిమా రెండు రంగాలు భ్రష్టుపట్టాయి. డబ్బుల కోసం, సినిమా కూడా వ్యాపారమే అనే వాదనతో వేశ్యల వంటి, వ్యభిచారం వంటి చిత్రాలను మన వారు ఎక్కువ మంది తీస్తున్నారు. ఇక మీడియా కూడా డబ్బులకు, సూట్‌కేసులకి లొంగి ఎవరి గురించి మాట్లాడితే ఆర్ధిక లాభం ఉంటుంది? టీఆర్పీలు ఉంటాయి? అనే విషయం ఆలోచిస్తోంది. ఇక అధికారులు డ్రగ్స్ కేసు విషయంలో విచారణ సందర్భంగా మీకు సినిమా వారే దొరికారా? అని కొందరు. వర్మ వంటి వారైతే అధికారులనే తప్పు పట్టే విధంగా మాట్లాడారు. అది తప్పుకాదా..?
ఇక తాజాగా ఓ టీవీ చానెల్ ఎడిటర్ సినిమా వారిని తప్పుగా మాట్లాడారని, వేశ్యలతో పోల్చారని సినిమా వారు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఆ చానెల్ ఎడిటర్ మాట్లాడింది ముమ్మాటికి తప్పే. మరి కోవర్ట్ లా వాదించిన అతను ఏం ఆశించి అలా ఆరోపణలు చేసాడో తెలియదు కానీ, సినిమా వాళ్లపై మాత్రం చాలా దిగజారుడు కామెంట్స్ చేశాడు. ఇది ఏ టైప్ అఫ్ జర్నలిజం అనేది ఆ చానెల్ కి, ఆ ఎడిటర్ కే తెలియాలి. ఇక సినిమా వారు కూడా అస్తమానం ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటే.. దీనిపై కూడా కాస్త దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు సినిమావారిపై, మీడియాపై ప్రజలకి చులకన భావాన్ని కలిగిస్తాయని గ్రహిస్తే మంచిది!