తెలుగులో హీరోయిన్ గానే కాకుండా కామెడీ పాత్రలు కూడా చేసిన నటి గీతాంజలి. ఇక ఈమె నటుడు రామకృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక రామకృష్ణ మరణం తర్వాత తన భర్తని సినీ పరిశ్రమ మర్చిపోవడంపై ఆమె ఫైర్ అయింది. శోభన్‌బాబు వంటి వారికి కూడా శ్రద్దాంజలిలు నిర్వహిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో పెద్ద వారు ఉన్నప్పుడు పట్టించుకోరు. మరణించిన తర్వాత మాత్రం శ్రద్దాంజలి అంటూ పబ్లిసిటీ చేస్తారు. రామకృష్ణ గారు మరణిస్తే ఎవ్వరూ పట్టించుకుని శ్రద్దాంజలి జరుపరా? ఎందుకు ఇలా తేడా చూపిస్తున్నారు. ఏం.. రామకృష్ణ పెద్ద నటుడు కాదా? దాదాపు 250 చిత్రాలలో ఆయన నటించారు. ఎన్టీఆర్ తర్వాత రాముడు, కృష్ణుడు పాత్రలకి రామకృష్ణనే సూట్ అవుతారు. 'నోము' చిత్రంతో ఆయన స్టార్‌గా మారారు. అలాంటి ఆయన విషయంలో ఎందుకు గౌరవం ఇవ్వడం లేదు. పలు అవార్డులను పలువురి పేర్ల మీద ఇస్తున్నారు.
రామకృష్ణ గారి పేరు మీద ఏ పురస్కారం ఎందుకు ఇవ్వడం లేదు? నా భర్తని ఎందుకిలా దూరంగా పెట్టారనేదే నాకు బాధని కలిగిస్తోంది... అని తన ఆవేదనను వెలిబుచ్చింది. ఇక ఈమె తన భర్త గురించి చెబుతూ, తన భర్తకి తాను ప్రేమగా ఉన్నప్పుడు గీతా అని పిలిచేవారు. నా మీద కోపం వస్తే మాత్రం 'గీతాంజలి గారండీ' అనే వారు. ఎవరైనా నాకోసం వచ్చిన కూడా గీతాంజలి గారూ.. మీకోసం ఎవరోవచ్చారు? అనేవారు. ఇక నాకు వంట చేయడం రాదు. అయినా ఆయనకు ఇష్టమైనవి చేయడం కోసం మా మేనత్తల నుంచి వంట నేర్చుకున్నాను. ఒక్కరోజు వీలుగాక వంట మనిషి చేత వండిస్తే వెంటనే కనిపెట్టి గీతాంజలి గారు అంటూ కోప్పడేవారు అని చెప్పుకొచ్చింది.