నేటి ఆధునిక యుగంలో మనిషి యంత్రంలా మారిపోతున్నాడు. ఉరుకుల పరుగులు జీవితం, కేవలం డబ్బు, సంపాదనలోనే ఆనందం ఉందని భావిస్తున్నారు. ఇక తన గురించి గానీ, తనని నమ్ముకున్న వారి గురించి కూడా ఆలోచించే సమయం మనవారికి ఉండటం లేదు. సాంకేతిక విప్లవం, మొబైల్స్, సోషల్ మీడియా నేపధ్యంతో ఉన్న కొద్ది పాటి అనుబంధాలు కూడా చెరిగిపోతున్నాయి. ఇక మనిషికి తనని తాను అంతర్మధనం చేసుకునే తీరిక, తమకంటూ కొంత సమయాన్ని వెచ్చించుకునే సౌలభ్యం కలగడం లేదు. దాని వల్లనే చిన్నపాటి విషయాలకు కూడా డిప్రెషన్‌కి లోనై ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు.
ఇక విషయానికి వస్తే మన స్వీటీ అదేనండీ అనుష్కశెట్టి యోగా టీచర్ మాత్రమే కాదు. ఆమె కంటూ ఎన్నో మంచి భావాలు ఉన్నాయి. ఈమె నటించిన 'భాగమతి' చిత్రం ఈ ఏడాది తొలిహిట్టుగా నిలిచింది. అందంతో మత్తెక్కించాలన్నా, లేదా కత్తిపట్టి స్వైరవిహారం చేయాలన్నా టాలీవుడ్‌లో విజయశాంతి తర్వాత అనుష్క మాత్రమే. అదే కోలీవుడ్‌కి వెళ్లితే మాత్రం నయనతార కనిపిస్తుంది. ఇక ఇటీవల అనుష్క తాను సినిమాలు ఒప్పుకోకపోవడం కాదు.. తనకి వేషాలు రావడం లేదని ఓపెన్‌గా చెప్పి సెహభాష్ అనిపించుకుంది. ఇక ఈమె ప్రేమ, పెళ్లి విషయాలలో పలు గాసిప్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తమిళంలో గౌతమ్ వాసుదేవమీనన్ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకుంది. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ శింబుతో ఓ చిత్రం చేస్తున్నాడు. అది పూర్తికాగానే అనుష్క చిత్రం మొదలుకానుంది.
ఇక అనుష్క తాజాగా మాలీవుడ్‌లో కూడా స్ట్రెయిట్ ఎంట్రీ ఇస్తోంది. ఇంతకాలం డబ్బింగ్ చిత్రాల ద్వారా మలయాళీలకు పరిచయమైన ఆమె తొలిసారి మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టితో జతకట్టనుంది. గతంలో నయనతార కూడా 'భాస్కర్ ఒరు రాస్కెల్' చిత్రంలో మమ్ముట్టితో నటించింది. ఇప్పుడు ఆ వంతు అనుష్కకి వచ్చింది. ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ.. ఏరంగంలోని వారికైనా తమ ఖాళీ సమయాల్లో ఎలా గడపాలి అనే విషయంలో నిశ్చితాభిప్రాయలు ఉంటాయి. కొందరు తమ స్నేహితులు, సన్నిహితులతో గడిపేందుకు ఇష్టపడతారు. నేను మాత్రం విరామం వస్తే ఏకాంతంగా ఉండాలని కోరుకుంటాను. విరామం దొరికితే ఏ పని పెట్టుకోను. 24గంటలు షూటింగ్‌ల్లో గడుపుతాం. అప్పుడు కథ, పాత్ర తప్ప ఏమీ ఆలోచించుకోవడానికి సమయం ఉండదు. నేను ఖాళీగా ఉంటే ఏకాంతంగా కూర్చుని నా విషయం నేను ఆలోచించుకుంటాను. అలా గడుపుకుంటేనే మనం చేసిన తప్పులు మన అంతరాత్మకి తెలుస్తాయి అని చెప్పుకొచ్చింది.