రామ్‌చరణ్ తన కెరీర్ స్టార్టింగ్‌లో 'మగధీర'లో అద్భుతంగా నటించి రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు. ఆ తర్వాత కాస్త విభిన్నంగా చేసిన 'ఆరేంజ్' చిత్రం ఫ్లాప్ అయింది. దాంతో ఆయన మరలా ప్రయోగం అంటూ చేయలేదు. రొటీన్ కథలైన 'రచ్చ, ఎవడు, నాయక్, బ్రూస్‌లీ, గోవిందుడు అందరివాడేలా' వంటి చిత్రాలు చేస్తూ వచ్చాడు. కానీ ఆయనకు మణిరత్నం ఓ మాట చెప్పాడు. వాస్తవానికి మణిరత్నం తీసిన 'ఓకే బంగారం' చిత్రంలో దుల్కర్‌సల్మాన్ స్థానంలో రామ్‌చరణ్ చేయాల్సి వుంది... కానీ అంత పెద్ద రిస్క్ చేయని రామ్‌చరణ్ ఆ చిత్రం చేయలేదు. ఇక తర్వాత మరోసారి బాలీవుడ్ ఎంట్రీని కూడా 'జంజీర్' టైటిల్‌తో అదే పాత కథని రీమేక్ చేశాడు. ఈ చిత్రం హిందీలోనే కాదు తెలుగులో కూడా డిజాస్టర్ అయింది. అలాంటి సమయంలో మణిరత్నం సినిమాకి ఓకే చెబుతున్నాడని వార్తలు వచ్చినా అది వర్కౌట్ కాలేదు. కానీ మణిరత్నం చెప్పిన ఓ మాట మాత్రం రామ్‌చరణ్‌పై తీవ్ర ప్రభావమే చూపింది. కొన్నేళ్ల తర్వాత తాను నటించానని గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రాలు కూడా చేయమని మణిరత్నం రామ్‌చరణ్‌కి సూచించాడు. దాంతోనే రామ్‌చరణ్ కాస్త విభిన్న చిత్రమైన 'ధృవ' చిత్రం చేశాడు.
ఇక తాజాగా 'రంగస్థలం'లో అయితే రామ్‌చరణ్‌లో ఇంత మంచి నటుడు ఉన్నాడా? అని గర్వించేలా చేశాడు. దీంతో రామ్‌చరణ్ వరుసగా రెండు విభిన్న చిత్రాలు, రెండు హిట్లు సాధించాడు. అదే ఆనందంలో ఉన్న ఆయన ఇక అభిమానుల కోసం మాత్రమే సినిమాలు చేయనని, అన్ని వర్గాలను మెప్పించే చిత్రాలు చేస్తానని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇది చిరంజీవి నటించిన 'గ్యాంగ్‌లీడర్' తరహాలో ఉంటుందిట. తన ఫ్యామిలీ మీదకి ఎవరు వచ్చినా వారిని రఫ్పాడించే ఉడుకు రక్తం కలిగిన కుర్రాడి పాత్రను చేస్తున్నాడని సమాచారం. తమ్ముడి దుందుడుకు స్వభావం చూసి అన్నయ్యలు సైతం భయపడి, తమకు ఏమైనా అవమానం, ఇతర సమస్యలు వచ్చినా తమ్ముడికి చెబితే గొడవలు అవుతాయని భావించి, ఆ విషయాలను రహస్యంగా ఉంచే కథ ఇది అని తెలుస్తోంది. మరి ఈ చిత్రంతో రామ్‌చరణ్ హ్యాట్రిక్‌ని నమోదు చేస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...!