బాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రముఖ నటీనటులు, హీరోల కొడుకులే కాదు.. కూతుర్లు, కోడళ్లు, కొడుకులు అందరు సినీరంగంలోకి వారసత్వంగా వస్తున్నారు. ఇక దక్షిణాదిలోని కోలీవుడ్‌లో కూడా శరత్‌కుమార్, యాక్షన్‌కింగ్ అర్జున్, కమల్‌హాసన్ వంటి వారి కూతుర్లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగులో మాత్రం ఈట్రెండ్ పెద్దగా లేదు. రాధ కూతుర్లు హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్‌గా పరిచయమైంది. కృష్ణ కుమార్తె మంజుల కూడా లేడీ ఓరియంటెడ్, కీలకమైన పాత్రలను చేసింది. అక్కినేని నాగార్జున మేనకోడలు, సుమంత్ సిస్టర్ సుప్రియా చిత్రాలలో నటిస్తోంది. ఇక ఉత్తేజ్ వంటి నటుల కూతుర్లు కూడా హీరోయిన్లు అయ్యారు. కానీ వీరికి ఆయా అభిమానుల ప్రోత్సాహం మాత్రం కుమారుల విషయంలో ఉన్నంతగా, కుమార్తెల విషయంలో ఉండటం లేదు. ఇక తాజాగా సినీ కపుల్ అయిన రాజశేఖర్, జీవితల పెద్దకూతురు శివాని బాలీవుడ్ రీమేక్ 'టూ స్టేట్స్'లో అడవి శేషుకి జతగా నటిస్తోంది. ఇక త్వరలో ఈమె కోలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టనుంది.
ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, నా తండ్రి రాజశేఖరే నాకు నటనలో స్ఫూర్తి. ఆయన వైద్యవృత్తిని వదిలిపెట్టకుండానే సినిమా కెరీర్ కొనసాగిస్తున్నారు. నాన్న వద్ద వైద్యం చేయించుకున్న వారు నాన్నని మేజిక్‌మేన్ అంటూ ఉంటారు. నేను కూడా వైద్యవృత్తినే అభ్యసించాను. నాకు ఇష్టమైన రంగాలు రెండు. ఒకటి వైద్యం, రెండు నటన. నేను మంచి డాక్టర్‌ని, నటిని అవుతానన్న నమ్మకం ఉంది. కుటుంబసభ్యులు, స్నేహితుల ముందు మాట్లాడేటప్పుడు, ఏదైనా పనిచేసేటప్పుడు నటిస్తున్నానని భావించు. అలాంటప్పుడే నీవు కెమెరా ముందు భయపడకుండా నటించగలవు... అని నాన్నగారు చెప్పారు. నేను ఇప్పుడు అదే పాటిస్తున్నాను. ఇక నేను మా అమ్మలా ఉంటానని కొందరు అంటున్నారు. నేను కూచిపూడి, కథకళి నేర్చుకుంటున్నాను. కిక్ బాక్సింగ్ విద్యలోనూ శిక్షణ పొందుతున్నాను. సినిమాలలో గాయనిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. అందుకే కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నాను. నాన్నే నా సినిమా ప్రపంచ హీరో. నేను మా అమ్మలా ఉంటానంటే సంతోషమే. ఈతరంలో నాకు సమంత అంటే బాగా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇక అక్కినేని, మెగా, మంచు, ఘట్టమనేని వారసురాళ్లు సరిగా రాణించని సమయంలో రాజశేఖర్-జీవిత దంపతుల కుమార్తె ఎలా రాణిస్తుందో వేచిచూడాల్సివుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడున్న వారిలో బాగా వివాదాస్పదమైన జంటగా రాజశేఖర్, జీవితలపై ముద్ర ఉంది. మరి శివానీ మాత్రం ఆ తోవలో నడవకుండా అందరినీ కలుపుకుని పోవాలని ఆశిద్దాం..! ఇక ఈమెకి నేటి యంగ్ హీరోలలో అత్యధికంగా ఉన్నమెగా హీరోల నుంచి చాన్స్‌లు వస్తాయో లేదో కూడా ఆసక్తిని కలిగిస్తోన్న అంశం.