పెద్దలు ర్యాగింగ్‌ని కూడా ఎందుకు పెట్టారంటే కొత్తవాళ్లలో పాత వారు, సీనియర్స్ భయం పోగొట్టేందుకే. కానీ అది నేడు వింత పోకడలు పోతోంది. ఇక టీజింగ్స్ కూడా ఎదుటి వారికి సంతోషాన్ని ఇచ్చేవిగా, వారు కూడా ఆత్మవిశ్వాసం పొంది నవ్వుకునేలా ఉండాలి. అదే సినిమాల విషయానికి వస్తే చెత్త గాసిప్స్, తలా తోకా లేని రూమర్స్ నటీనటులను బాధిస్తాయి. కానీ కొన్ని పుకార్లు మాత్రం నిజమైతే బాగుండు అని ఆయా నటీనటులు భావించేలా ఉంటాయి. అలాంటి గాసిప్ ఒకటి కొన్నిరోజులుగా హల్‌చల్ చేస్తోంది.
విషయానికి వస్తే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. తెలుగులో కూడా సినిమాలు తీసిన దర్శకుడు ప్రియదర్శన్, తెలుగువారికి బాగా పరిచయమున్న నాటి హీరోయిన్ లిజిలకు పుట్టిన భామే ఈ అమ్మడు. ఈమె ఇటీవల అక్కినేని అఖిల్ నటించిన 'హలో' చిత్రంలో హీరోయిన్‌గా పరిచయం అయింది. తన క్యూట్ లుక్స్, యాక్షన్‌తో బాగానే ఉందనిపించింది. ఇక ఈమె తాజాగా శర్వానంద్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో శర్వానంద్ సరసన నటిస్తోంది.
ఈమె మీద వచ్చిన గాసిప్ ఏమిటంటే.. ఆమెకి తాజాగా మలయాళం నుంచి ఓ అద్భుతమైన అవకాశం వచ్చిందని, మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ 'ఆది' తర్వాత చేస్తోన్న తదుపరి చిత్రానికి దర్శకుడు ఐవి శశి కుమారుడు అయిన శశి దర్శకత్వం వహించనున్నాడని, ఈ చిత్రంలో హీరోయిన్‌గా కళ్యాణి ప్రియదర్శి ఎంపికైందని ఆ వార్తల సారాంశం. ఇది చివరకు ఆ నోటా ఈ నోటా ఆమె వరకు చేరింది. దీనిపై ఆమె స్పందిస్తూ, ఇదంతా పుకారు మాత్రమే. ఈ చిత్రం గురించి నన్ను ఎవ్వరు అప్రోచ్‌కాలేదు. ఇక ఈ పుకారు నిజం అయితే మాత్రం నాకెంతో సంతోషం వేస్తుంది.. అంటూ తన మనసులోని మాటలను బయటపెట్టింది...!