తాజాగా 65వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఉత్తమ ప్రజాదరణ కలిగిన చిత్రంతో పాటు మరో రెండు అవార్డులను 'బాహుబలి' చిత్రం అందుకుంది. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రానా దగ్గుబాటి హీరోగా సంకల్ప్‌రెడ్డి అనే కొత్త కుర్రాడి దర్శకత్వంలో వచ్చిన 'ఘాజీ' ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డులపై తాజాగా జనసేనాని పవన్‌కళ్యాణ్ స్పందించాడు. 'బాహుబలి' చిత్రం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగానే కాక మరో రెండు అవార్డులను, యుద్దం నేపధ్యంలో వచ్చిన 'ఘాజీ' చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరెండు చిత్రాలు ఆయా అవార్డులను పొందడానికి ఎంతో అర్హమైనవి.
'బాహుబలి' హీరో ప్రభాస్‌కి, 'బాహుబలి, ఘాజీ' నటుడు దగ్గుబాటి రానాకి ఆయన శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈరెండు చిత్రాల దర్శక నిర్మాతలకు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు పవన్ అభినందనలు తెలిపాడు. ఈ స్ఫూర్తితో తెలుగు చిత్ర సీమ నుంచి మరిన్ని ఉత్తమ చిత్రాలు రావాలని ఆయన ఆకాక్షించారు. ఇక ఈమధ్య తెలుగులో ప్రేక్షకుల మైండ్ సెట్‌లో కూడా బాగా మార్పు కనిపిస్తోంది. 'అర్జున్‌రెడ్డి, బాహుబలి, శతమానం భవతి, శ్రీమంతుడు, సోగ్గాడే చిన్నినాయనా, ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' వంటి పల్లెటూరి, ఆర్బన్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు కూడా ఘనవిజయం సాధిస్తున్నాయి.
మరోవైపు 'నాన్నకుప్రేమతో'తో పాటు ఇతర వెరైటీ చిత్రాలు కూడా ప్రేక్షకుల మనసులను దోచుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ విషయాన్ని 'భాగమతి, తొలిప్రేమ, రంగస్థలం' వంటి మూడు విభిన్నబ్యాక్‌డ్రాప్ ఉన్న చిత్రాలు సక్సెలు సాధించడంతో ప్రేక్షకుల అభిరుచి మారిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి ఈ స్ఫూర్తితో రాబోయే కాలంలో మరెన్ని మంచి చిత్రాలు వస్తాయో వేచిచూడాల్సి వుంది....!