నేటి రోజుల్లో సమస్య మీద చర్చించి, పబ్లిసిటీ పొందడం తప్ప, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటో మాత్రం ఎవ్వరూ చెప్పలేక పోతున్నారు. ఉదాహరణకు శ్రీరెడ్డి ఏవేవో ఆరోపణలు చేస్తోంది. దానికి సంబంధించిన వారి పేర్లను బయటపెడుతోంది. అయితే దీనిని అరికట్టడానికి ఏమి చేయాలో మాత్రం ఆమె కాదు..ఎవరూ చెప్పలేకపోతున్నారు. సమస్య వచ్చిందని మీడియా దానికి ఆజ్యం పోస్తుంటే నలుగురు నాలుగు రకాల మాటలు మీడియాలో అనేసి తాము కూడా పోరాట యోధులం అని నిరూపించుకునే దారిలో ఆలోచిస్తున్నారే గానీ సరైన పరిష్కారం మాత్రం చూపించలేకపోతున్నారు. ఈ విషయంలో తమిళ యంగ్ హీరోయిన్, 'మెంటల్ మదిలో' ఫేమ్ నివేదా పేతురాజ్ మాత్రం దానికి పరిష్కారం చూపగలిగేలా చేసిన ట్వీట్ మాత్రం సామన్యులను బాగా ఆకట్టుకుంటోంది. కాస్టింగ్కౌచ్లు, ఆడవారిపై అఘాయిత్యాలు కేవలం ఇండియాలో, టాలీవుడ్లోనే జరగడం లేదు. ఎంతో ముందున్న పాశ్చాత్యదేశాలు, హాలీవుడ్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మార్పు రావాలంటే కేవలం మగాళ్ల మైండ్‌సెట్ మారడం తప్ప దానికి విరుగుడే లేదనే చెప్పాలి. చట్టాలను కఠినతరం చేయడం, అదే సమయంలో పారదర్శకత ఏర్పాటు చేయడం, మగాళ్లలో మన తల్లి, మన చెల్లి అనే భావన కలిగించి చైతన్యం చేయడం మాత్రమే వీటికి విరుగుడుగా భావించాలి.
దీని గురించి నివేదా పేత్‌రాజ్ మాట్లాడుతూ, మగాళ్లు ముందుగా మారాలి. మగాళ్లు తలుచుకుంటేనే లైంగిక వేధింపులు ఆగిపోతాయి. నేను కూడా బాల్యంలో వేధింపులు ఎదుర్కొన్నాను. మన చుట్టూ ఉన్నవారు, మన బంధువులు, వారూ కాకపోతే మనకి తెలిసిన వారే వీటికి పాల్పడుతున్నారు. మన దేశం అనేక సమస్యలతో సతమతమవుతోంది. అన్నింటినీ కాకపోయినా కొన్నింటిని మనమే పరిష్కరించుకోగలం. అందులో ఒకటి ఉమెన్ సేఫ్టీ. చిన్నప్పుడు నాపై లైంగిక వేధింపులు జరిగితే ఎలా చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాలేదు. తల్లిదండ్రులు ఎంతో కేర్‌ఫుల్‌గా ఉండాలి. పిల్లలతో కూర్చుని ఏమి జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. స్కూల్స్‌లో, ట్యూషన్లలలో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. మగాళ్లు ఆడవారి కోసం ఎన్నో చేస్తారు.
మన చుట్టుపక్కల ఆడవాళ్లు పడుతున్న ఇబ్బందులను గమనించండి. వారికి మీరు ఎలా సాయపడగలరో సాయపడండి. ప్రతి దానికి పోలీసుల మీద ఆధారపడలేం. అలాగని ప్రతి ఒక్కరిని అనుమానించలేం. మగాళ్లు తలుచుకుంటే లైంగిక వేధింపులు ఆగిపోతాయి. నేను ప్రతి మగాడిని కోరేది ఏమిటంటే మీరు మమ్మల్ని కాపాడండి అని కోరింది. ఈమె పోస్ట్‌కి మంచి స్పందన వస్తుండటం విశేషమని చెప్పాలి.