రమ్యకృష్ణ విషయానికి వస్తే అప్పుడెప్పుడో రజనీకాంత్ హీరోగా నటించగా, కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'నరసింహ' చిత్రంలోని నీలాంబరి పాత్ర గుర్తుకు వస్తుంది. ఇక ఇటీవల వచ్చిన 'బాహుబలి' చిత్రంలో రాజమాత శివగామిగా ఆమె నటన అద్భుతం. కానీ ఇటీవల వచ్చిన ఆమె నటించిన పలు చిత్రాలు మరలా అలాంటి మ్యాజిక్‌ని చేయలేకపోయాయి. ఇక ఆమె నటించిన 'గ్యాంగ్' చిత్రంలో కూడా సూర్యకి ఆమె తన నటన ద్వారా బ్రేక్ ఇవ్వలేకపోయింది. తాజాగా రమ్యకృష్ణ అక్కినేని నాగచైతన్య-మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రంలో టైటిల్ పాత్ర అయిన శైలజారెడ్డిగా నటిస్తుండగా, ఆమె కూతురుగా అనుఇమ్మాన్యుయేల్ నటిస్తోంది.
ఇక విషయానికి వస్తే 'ఆనందో బ్రహ్మ' చిత్రం దర్శకుడు మహి. వి.రాఘవ త్వరలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌ని తీయనున్నాడు. మొదట్లో ఈ వార్తలు వచ్చినా ఏదో సాదా సీదా చిత్రం అని భావించారు. కానీ ఈ చిత్రంలో వైఎస్ పాత్రకు ఎంతో ఆచితూచి సినిమాలు ఒప్పుకునే మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్రంపై అందరిలో అంచనాలు పెరిగాయి. ఇక ఈచిత్రంలో రాజశేఖర్‌రెడ్డి ప్రతి పక్షనేతగా ఉన్నప్పుడు చేసిన పాదయాత్ర, ఆనాటి సంఘటనలు, ఈ పాదయాత్ర ఆయన కెరీర్‌కి ఎలా ఉపయోగపడింది? అనే పాయింట్ ఆధారంగా తీయనున్నాడు. టైటిల్‌గా కూడా 'యాత్ర' అనేది కన్‌ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రం ప్రీ లుక్‌లో రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే పంచకట్టి, జనాలకు అభివాదం చేస్తూ మమ్ముట్టి అద్భుతంగా కనిపిస్తున్నాడు.
ఈ చిత్రంలో వైఎస్ భార్య విజయమ్మ పాత్రకి మొదట నయనతారను సంప్రదిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ నయనతార ఆ పాత్రకి సూట్ కాదని, ఎందుకంటే ఆమె వైఎస్ జగన్‌కి తల్లి లాంటి పాత్ర చేయదగ్గ నటి కాదని పలువురు ఊహించారు. ఎట్టకేలకు విజయమ్మ పాత్రను రమ్యకృష్ణ చేత చేయించనున్నట్లు సమాచారం. ఇక వైఎస్ జగన్‌గా సూర్య నటించనున్నాడని అంటున్నారు. జగన్‌తో సూర్యకి మంచి అనుబంధమే ఉంది. ఆయన భారతీ సిమెంట్స్ కూడా సూర్యనే అంబాసిడర్. ఇక ఈయన ఇటీవల జగన్ పాదయాత్ర కూడా సక్సెస్ కావాలని కోరుకున్నాడు. సో.. సూర్యని జగన్ పాత్రకి తీసుకుంటే రమ్యకృష్ణ కొడుకుగా సూర్య నటించాల్సి వుంటుంది.