మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోవడంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది చిత్ర బృందం. ఇక మహేష్ కూడా ఎన్నడూ మాట్లాడని విధంగా మీడియాతో, సన్నిహితులతో మట్లాడుతూ చాలా యాక్టివ్ గా ఉన్నాడు. అయితే భరత్ సినిమా హిట్ తర్వాత మహేష్ మైండ్ సెట్ మారిందనే టాక్ వినబడుతుంది. అందుకే వంశి పైడిపల్లితో తాను చెయ్యబోయే 25 వ సినిమాపై ఆలోచనలో పడినట్లుగా టాక్. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పూజ కూడా ఎప్పుడో జరిగిపోయింది. సినిమా సెట్స్ మీదకెళ్లడమే తరువాయి. కానీ ఈ సినిమా సెట్స్ మీదకెళ్లడంపై ఎటువంటి స్పష్టత లేదు.
అందుకే మహేష్ కూడా వంశి తో చెయ్యబోయే తన 25 వ సినిమాపై ఎక్కడా మాట్లాడకుండా గుంభనంగా ఉంటున్నాడని.. ఈ సినిమా పట్టాలెక్కేందుకు టైం పడుతుందనే షాకింగ్ విషయం వినబడుతుంది. అయితే సినిమా ఆలస్యానికి కారణం.. వంశి ఆమధ్యన ఎప్పుడో రెడీ చేసిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు సూచిస్తూ.... మార్పులు చేసిన కొత్త వెర్షన్ ని మరోసారి తమకి విన్పించాలని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు.. వంశి పైడిపల్లిని అడిగినట్టు సమాచారం. ఇక ఈ సినిమా కి మరో నిర్మాత అశ్విని దత్ ఈ సినిమా భారాన్ని మొత్తం దిల్ రాజుపై పెట్టినట్టుగా తెలుస్తుంది.
'భరత్ అనే నేను' బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు వంశి సినిమాలో కొన్ని మార్పులను దిల్ రాజు సూచించాడని... మరి ఇదే నిజమైతే వంశి - మహేష్ ల సినిమా పట్టాలెక్కేందుకు సమయం పడుతుందని అంటున్నారు. మరి వంశి ఇంతకుముందు మహేష్ కోసం 'పోకిరి' తరహా సబ్జెక్టు ని రెడీ చేసి.. అల్లరి నరేష్, హీరోయిన్ పూజ హెగ్డేలను కూడా కథకు అనుగుణంగా ఎంపిక చేసాడు. కానీ ఇప్పుడు వంశి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు జరిగితే... మహేష్ 25 వ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి మహేష్... వంశి సినిమా పూర్తి చేసి సుకుమార్, సందీప్ వంగాల సినిమాలు చెయ్యాల్సి ఉంది.