ఈ ఏడాది సంక్రాంతి సీజన్ సినీ ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత వచ్చిన 'భాగమతి, ఛలో, తొలిప్రేమ, నీది నాది ఒకే కథ' వంటి చిత్రాలు బాగున్నా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేసే చిత్రాలు మాత్రం కావు. ఆ సినిమాల రేంజ్‌కి తగ్గట్లుగా అవి బాగున్నాయని అనిపించుకుని కాస్త లాభాలు చూశాయి. ఇక సమ్మర్ హీట్ మాత్రం టాలీవుడ్‌లో మామూలుగా లేదు. ముందుగా సమ్మర్‌ని ప్రారంభిస్తూ రామ్‌చరణ్-సుకుమర్- మైత్రి మూవీమేకర్స్ కలసి వందకోట్లకు పైగా కొల్లగొట్టిన 'రంగస్థలం'ని ప్రేక్షకులకు అందించాయి. ఈ చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ స్టడీగానే ఉన్నాయి. మరోవైపు ఆ వెంటనే తన గత రెండు చిత్రాలైన 'బ్రహ్మోత్సవం, స్పైడర్'ల బాకీని తీర్చేస్తూ మహేష్ బాక్సాపీస్ వద్ద వీరంగం చేస్తున్నాడు. మహేష్‌బాబు- కొరటాలశివ- దానయ్యలు 'భరత్ అనే నేను'ని మాస్టర్ పీస్‌గా మార్చేశారు. ఈ వారం విడుదల కానున్న 'కణం, ఆచారి అమెరికా యాత్ర' చిత్రాలు విడుదలయినా హాలీవుడ్ డబ్బింగ్ మూవీ 'అవేంజర్స్' మాత్రమే కాస్త చెప్పుకోదగిన చిత్రం. అయినా ఈ చిత్రానికంటూ కొందరు ప్రత్యేకంగా ఉంటారే గానీ ఈ చిత్రం 'రంగస్థలం, భరత్ అనే నేను'లపై చూపించే ప్రభావం మాత్రం తక్కువేనని చెప్పుకోవాలి.
ఇక ఈ రెండు చిత్రాలు ఇరగదీస్తూ ఉండటంతో మే4న విడుదల కానున్న అల్లుఅర్జున్ 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా'పైనే అభిమానుల చూపంతా ఉంది. న్యూస్‌రీడర్‌గా, నటునిగా, రచయితగా నిరూపించుకున్న వక్కంతం వంశీని నమ్మి ఎన్టీఆర్ చాన్స్‌ఇవ్వకపోయినా కూడా బన్నీ మాత్రం వక్కంతంని నమ్మాడు. ఈ చిత్రం కూడా అద్భుతంగా వచ్చిందనే తెలుస్తోంది. ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. దేశభక్తి కంటెంట్‌తో సినిమా ...మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో స్టార్ హీరో నటించిన చిత్రం వచ్చి చాలా కాలం కావడం, ఇందులో బన్నీ పవర్‌ఫుల్ మిలటరీ ఆఫీసర్‌గా, దేశభక్తిని నరనరాన జీర్ణించుకుని విపరీతమైన కోపం ఉండే యాంగ్రీ యంగ్‌మేన్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రంపై నిర్మాత లగడపాటి శ్రీధర్, నాగబాబు, బన్నీ వాసులు ఎంతో నమ్మకంగా ఉన్నారు.
లగడపాటి శ్రీధర్ అయితే మరో అడుగు ముందుకేసి ఈ చిత్రం నచ్చకపోతే డబ్బులు వాపస్ ఇస్తానని చేసిన వ్యాఖ్యలు సాధ్యం కాకపోయినా ఆయనకు ఈ చిత్రంపై ఉన్న నమ్మకాన్ని ఇవి చూపిస్తున్నాయి. ఇక ఈ చిత్రం అన్ని వర్గాలను మెప్పించేలా ఉండనుందని పాటలు వింటేనే అర్ధమవుతోంది. ఇక తమిళం, మలయాళంలో డబ్బింగ్ కానున్న ఈ చిత్రం కోసం ఆయా భాషల రైట్స్ తీసుకున్న నిర్మాతలు ఈరోజు నుంచే తమ భాషల్లో వచ్చే దినపత్రికల్లో ఈ చిత్రం ప్రకటనను ఇచ్చారు. ఇక ఈనెల 29న ఈ చిత్రం ప్రీరిలీజ్‌వేడుక హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనుండగా, రామ్‌చరణ్ ముఖ్య అతిధిగా రానున్నాడు. ఈ చిత్రం కోసం భారీ ఏర్పాట్లు జరుగుతుండటంతో పాటు ఇందులో అల్లుఅర్జున్ స్టేజీ పైకి మామూలుగా రాడట. ఆయన వేదికపై ఎంట్రీ ఇచ్చే సందర్భం ఈ చిత్రం కంటెంట్‌ని ప్రతిబింబించేలా ఉంటుందని, కేవలం బన్నీ వేదికపై ఎంట్రీ ఇచ్చే దానికే 20లక్షలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ అయితే తిరుగేలేదు. ఇటీవల బన్నీ సాదాసీదా కంటెంట్‌తో చేసిన చిత్రాలు కూడా భారీ వసూళ్లని సాధించాయి. మరి ఈ చిత్రం టాలీవుడ్‌కి హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి...!