వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే కాదు.. ఆయన సొంతపార్టీ వారిని, ప్రజలను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయి. అసలు రైతు రుణమాఫీ సాధ్యం కాదని, పించన్ల మొత్తాలను పెంచడం తప్పని వ్యాఖ్యలు చేసిన నాటి జగన్ ఇప్పుడు వాటిని మరింత ఎక్కువగా పెంచడానికి రెడీ అంటున్నాడు. మరోవైపు టిడిపి వ్యవస్థాపకుడు, మాజీముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద ఆయనకు ప్రేమ పొంగి, నారాచంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పోడిచాడని మాట్లాడుతున్నాడు. మరోవైపు ప్రకాశం జిల్లా పాదయాత్రలో రాజధానికి 'అమరావతి' కాకుండా 'దొనకొండ'ను ఎంపిక చేయాల్సిందని మాట్లాడి ప్రకాశం జిల్లా వాసుల మనసులు గెలుచుకోవాలని ప్రయత్నించిన ఆయన ఇప్పుడు కృష్ణా జిల్లా పేరును నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేస్తానని చెప్పిమరోచర్చకు, వివాదానికి దారితీశాడు.
అసలు నెల్లూరు, ఒంగోలు వంటి జిల్లాలకు పొట్టిశ్రీరాములు, ప్రకాశం పంతులు వంటి వారి పేర్లు పెట్టడం సమర్ధనీయమే గానీ కడపకి వైఎస్‌ఆర్ కడప జిల్లా, లేకపోతే కృష్ణ జిల్లాకు వంగవీటి జిల్లా, అనంతపురంకి పరిటాల జిల్లా.. ఇలా పెట్టుకుంటూ పోతే మనం ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నామనేది అర్ధం కాదు. ఇక ఎన్టీఆర్ మీద ప్రేమతో కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెడతామని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ రాష్ట్ర రాజకీయ సలహాదారు దుట్టా రామచంద్రరావు దీనిపై ఓపెన్‌గా నిరసన గళం వినిపించాడు.
కృష్ణమ్మ తల్లి ఎక్కడో పుట్టి ఎన్నోచోట్లు దాటుకుని మన రాష్ట్రంలోకి వచ్చి కృష్ణాజిల్లాను సస్యశ్యామలం చేస్తోందని, దేశం మొత్తంలో ఏ రాష్ట్రంలోనూ కృష్ణాజిల్లా పేరుతో ఎక్కడా ఏ జిల్లా లేదని, అది కేవలం మన ఆంద్రప్రదేశ్‌లోనే ఉందని తెలిపాడు. ఇప్పటికైనా జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పార్టీకి రాజీనామా చేసి నిరవదిక నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించాడు. కృష్ణా జిల్లా పరిరక్షణ సమితి పేరుతో ఏర్పడి ఉద్యమిస్తామని, ఎన్టీఆర్ మీద అభిమానం ఉంటే విగ్రహాలు, స్మారక భవనాలను కట్టుకోవాలి గానీ జిల్లా పేరు మారిస్తే ఊరుకునేది లేదని చెప్పారు!