మహానటి సావిత్రి బయోపిక్‌గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న 'మహానటి' చిత్రం ఈనెల 9వ తేదీన విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో కీర్తిసురేష్, దుల్కర్‌సల్మాన్, సమంత, విజయ్‌దేవరకొండ, షాలినీ పాండే, ప్రకాష్‌రాజ్, మోహన్‌బాబు వంటివారు నటిస్తున్నారు. ఇక ఈ వేడుకు సావిత్రి కుమారుడైన సతీష్, కుమార్తె విజయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అమ్మానాన్నలపై తీసిన చిత్రాన్ని చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని, అమ్మే తమను ఇక్కడికి రప్పించిందని తెలిపారు.
అభిమానులు చూపిస్తున్న ఆప్యాయతే తమను ఇక్కడికి తీసుకుని వచ్చిందని, తాము ఎంతో అదృష్టవంతులమని విజయ అన్నారు. ఇక సావిత్రి కుమారుడు సతీష్ మాట్లాడుతూ, సినిమా ప్రకటించగానే కాస్త భయపడ్డాను. ట్రాజెడీగా తీస్తున్నారేమో అనిపించింది. నాగ్ అశ్విన్‌ని పిలిపించుకుని కథను వినాలని అనుకున్నాను. అశ్విన్ ఫోన్‌లో కథ చెబుతుంటే కన్నీరు ఆగలేదు. ఏడవకూడదని అనుకుంటూనే 30సార్లు ఏడ్చేశాను.... అని చెప్పుకొచ్చాడు.
దీనిని బట్టి చూస్తే సావిత్రి చరమాంకంలో ఆమె పడినవేదన, కష్టనష్టాలువంటివి పెద్దగా చూపించే అవకాశం లేదని, జెమినిగణేషన్‌నికూడా పాజిటివ్ యాంగిల్‌లోనే చూపిస్తున్నారేమో అనిపిస్తోంది. అంతగా మార్పులు చేర్పులు చేసి, ఈమె నిజజీవిత విశేషాలను, ఎవ్వరికీ తెలియని తెర వెనక రాజకీయాలను ఆవిష్కరించలేనప్పుడు దానికి బయోపిక్ అనే పేరు పెట్టడమే వృధా అని చెప్పక తప్పదు.